CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ లీడర్. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినవాడు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన వాడు.. అంతేకాదు అసలు సిసలైన దూకుడు ప్రదర్శించేవాడు. భారత రాష్ట్ర సమితిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించినవాడు.. అలాంటి రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఎలా ఉండేవాడు? ఆయన బాల్యం ఎలా సాగింది? కళాశాల జీవితం ఎలా కొనసాగింది? వనపర్తి నుంచి హైదరాబాద్ దాకా ఆయన ప్రయాణం ఎలా ప్రారంభమైంది? వీటిపై ఆయన స్నేహితులు చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
1983_85 కాలంలో రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. ఆయన అప్పట్లో బైపిసి గ్రూప్ తీసుకున్నారు. సైకిల్ మీద కాలేజీకి వెళ్లి వచ్చేవారు. తోటి స్నేహితులతో సరదాగా ఉండేవారు. మృదుస్వభావి, ఎక్కువగా ఎవరితో మాట్లాడిన దాఖలలు ఉండేవి కావు. కాకపోతే రోజు సాయంత్రం బయట హోటల్ లో టీ తాగే వారు. అప్పుడప్పుడు క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లేవారు. అంటే తప్ప ఇతర ఏ వ్యసనాల జోలికి కూడా పోయేవాళ్ళు కాదు.. క్లాసులో లీడర్ గా కొనసాగే వారు. అప్పట్లోనే ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, మంచి స్థాయికి ఎదుగుతాడని స్నేహితులు ఊహించారు. అనుకున్నట్టుగానే రేవంత్ రెడ్డి జెడ్పిటిసిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఇలా అంచలంచెలుగా ఎదిగారు. మంత్రిగా చేసిన అనుభవం లేకుండానే ముఖ్యమంత్రి అయిన ఘనతను సాధించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం పట్ల అతడి స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. అతడి ఎదుగుదల చూసి మురిసిపోతున్నారు.. తమ స్నేహితుడు ఇంతటి వాడు కావడం పట్ల గర్వంతో ఉప్పొంగిపోతున్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఆయన స్నేహితులను ఓ ప్రైవేటు న్యూస్ ఛానల్ పలకరించింది. అప్పట్లో ఇంటర్ చదివే రోజుల్లో రేవంత్ రెడ్డి తో ఎలాంటి అనుబంధం ఉండేదో అడిగింది.”రేవంత్ రెడ్డి చాలా మంచివాడు. ఇప్పుడున్నట్టు అప్పట్లో దూకుడుగా ఉండేవాడు కాదు. క్లాసులో లీడర్ గా ఉండేవాడు. బాగా చదివేవాడు. బైపీసీ గ్రూప్ తీసుకున్నప్పటికీ డ్రాయింగ్ బాగా వేసేవాడు. అప్పట్లోనే బ్యానర్లు రాసేవాడు. అలా బైపిసి గ్రూప్ అనంతరం జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ గ్రూపు తీసుకున్నాడు. అలా ఫైన్ ఆర్ట్స్ లో నైపుణ్యం సంపాదించిన తర్వాత సొంతంగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఎత్తుకు ఎదిగాడు.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరుకుంటున్నట్టు” అతడి స్నేహితులు వివరించారు. రేవంత్ రెడ్డి గురించి చెబుతున్నప్పుడు అతడి స్నేహితులు చాలా ఉద్వేగానికి గురయ్యారు. అతడు ముఖ్యమంత్రి కావడం ఎంత సంతోషంగా ఉందో వారి ముఖంలో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే రేవంత్ మీద విమర్శలు చేసే ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒక్కసారి ఈ వీడియో చూస్తే అతడు ఎక్కడి నుంచి ఎక్కడిదాకా ఎదిగాడో అర్థమవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
View this post on Instagram