Hindenburg Report vs Adani : ఒక గొర్రె పోయి బావిలో పడితే మిగతా గొర్రెలన్నీ బావిలోనే పడతాయి అని ఓ నానుడి ఉంది. ఇది మీడియాకు బాగా వర్తిస్తుంది. ప్రస్తుతం అదానీ విషయంలో మీడియా అదే చేస్తోంది. ఆదానీ వ్యాపార లావాదేవీలపై హిండెన్ బర్గ్ నివేదిక వెలువడిన నాటి నుంచి నేటి వరకూ మీడియా ఒకే కోణంలో వార్తలు రాస్తోంది. ప్రసారమూ చేస్తోంది. వేరే కోణం గురించి ఆలోచించడం లేదు. కనీసం ఆ ప్రయత్నం చేయడం లేదు. ‘ఇక ఆదానీ పని అయిపోయినట్టే రూ. 12 లక్షల కోట్లు నష్టపోయాడు. వరల్డ్ నంబర్-3 గా ఉన్న ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని కోల్పోయినట్టే భావించాలి. ఇక ఇప్పట్లో ఆయన కోలుకోలేడు. బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వవు. మెజార్టీ మీడియా ఇదే కోణంలో “విష” విశ్లేషణ చేస్తోంది.. మరీ ఆ నమస్తే తెలంగాణ అయితే ఆదానీ మీద రోజూ టన్నుల కొద్దీ విషాన్ని చిమ్ముతోంది. తన భాస్‌కు మోదీ అంటే పడదు. ఆ మోదీకి ఆదానీ అత్యంత ఇష్టుడైన గుజరాతీ వ్యాపారి కాబట్టి సహజంగానే నమస్తే తన అక్కసును బయట పెట్టుకుంటోంది. ఇదే దశలో ఆ బీబీసీ మీద దాడి జరిగితే మాత్రం ‘ఆయ్యో దేశంలో ప్రజాస్వామ్యం బజారున పడుతోంది. పెన్ స్వామ్యం, పత్రికా స్వేచ్ఛ నాశనమవుతోంది అని శోకాలు పెడుతోంది. అదే తన యజమాని మీడియాను ఎనిమిది కిలోమీటర్ల లోతున తొక్కేస్తా అని హెచ్చరిస్తే మాత్రం కిక్కురుమనదు. సరే ఇదంతా పక్కన పెడితే అసలు ఆదానీ ఆస్తుల పడిపోయిన నేపథ్యంలో మీడియా చాల కోణాలను విస్మరించింది. అవి ఎంటటే..
అందులో తప్పేముంది
అసలు షేర్ మార్కెట్ అంటేనే పోకర్ గేమ్ లాంటింది. ఎవరికి సుడి ఉంటే వారి మీద కనక వర్షం కురుస్తుంది. లేదంటే పెట్టుబడి కూడా మిగలకుండా ఊడ్చుకుపోతుంది. అసలు ఆ షేర్ మార్కెట్ అంటేనే ఇన్ సైడ్ ట్రేడింగ్, మన్నూమశానం ఉంటాయి. అందులో ఏ కంపెనీ కూడా సొక్కం కాదు. అక్కడి దాకా ఎందుకు రిలయన్స్ వ్యాపార విస్తరణ కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. కేజీ గ్యాస్ బేస్ కోసం ఏకంగా అప్పటి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి శాఖనే మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అందు చేత ఈ పంకిలంలో ఎవరూ సుద్దపూసలు కారు. సత్య హరిశ్చంద్రులు అంతకన్నా కారు. ఇక మోదీ ప్రధాని అయ్యాక ఆదానీ రెచ్చిపోతున్నారనేది వాస్తవం. పోటీ కంపెనీలను బెదిరిస్తున్నారనేది వాస్తవం, వాటిని టేక్ ఓవర్ చేసుకుంటున్నారనేది కూడా వాస్తవం. కానీ బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించే క్రమంలో తాను కూడా తప్పులు చేస్తున్నాడు. అసలు షేర్ మార్కెట్ లో లిస్ట్ అయిన పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కడో ఒక చోట పొలిటికల్ సపోర్ట్ తీసుకుంటాయి. ఎన్నికల్లో పొలిటికల్ పార్టీలు కంపెనీల సపోర్ట్ తీసుకుంటాయి. ఇది సయామీ కవలల బంధం. మోదీ, అదానీతోనే మొదలు కాలేదు. ఇప్పటితో అంతం కాదు. అదానీ వ్యవహారంలో అంతెత్తున ఎగిరిపడుతున్న సీపీఎం మాత్రం ఏం గొప్ప పనులు చేసింది? కార్యకర్తల దగ్గర నుంచి సమీకరించిన డబ్బులతో టెన్ టీవీని ఏర్పాటు చేసి తర్వాత అమ్మేసింది కదా. తమ కింద నలుపును చూసుకోలేని వారు మిగతా వాళ్ల నలుపులను ఎలా ఎంచుతారు? ఒకవేళ ఎంచినా దానికి ఉన్న క్రెడిబులిటీ ఎంత? ఇక హిండెన్‌బర్గ్ రిపోర్టు ఆధారంగా ఇప్పుడు ఆదానీ తనను తాను కరెక్ట్ చేసుకుంటాడు. మళ్లీ ఫినిక్స్ పక్షి లాగా ఎగురుతాడు. ఎందుకుంటే ఒక కార్పొరేట్‌కు తాను ఎంతలా ఎదుగుతున్నాను అనే దానిని మాత్రమే చూసుకుంటాడు.
సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు
గుజరాత్‌లోని ముంద్రా పోర్టు ఇప్పుడు గౌతమ్ చేతులో ఉంది. ఇది ఫుల్లీ ఆటోమేషన్‌తో నడుస్తుంది. క్షణాల్లో సరుకు దించుతుంది. కొంచెం ఆలస్యమైనా ఓడకు పరిహారం చెల్లిస్తుంది. మరోవైపు ఆదానీ తనకున్న రాజకీయ ప్రాబల్యంతోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ధనవంతుడయ్యాడని అందరూ అంటున్నారు. కానీ తనకు వ్యాపార నైపుణ్యాలు లేకపోతే ఎలా అంత స్థాయికి ఎదుగుతాడు? అంతే కాదు గుజరాత్ లోని కచ్ ఎడారి ప్రాంతాన్ని మైనర్ పోర్ట్‌గా నిర్వహించే అవకాశం అదానీకి ఇచ్చినప్పుడు అతడు దానిని భారతదేశపు అతిపెద్ద ఓడరేవుగా మార్చాడు. మార్క్స్, డుగ, భాయి వంటి ప్రపంచశ్రేణి కంపెనీలను తోసి రాజని సరుకు రవాణాలో నంబర్ వన్ కంపెనీగా ఎదగడం మాములు విషయం కాదు. నేడు భారతదేశం సరకు రవాణాలో పావు వంతు భాగాన్ని ఆదానీ కంపెనీ లిమిటెడే నిర్వహిస్తోంది అంటే మాటలు కాదు. శ్రీలంక టెర్మినల్‌పై 750 మిలియన్ డాలర్లు, హైఫా ఫోర్డ్‌పై 1.18 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాడంటే అతడి వ్యాపార దక్షత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముంద్రాపోర్టు నేడు లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టుగా మార్చాడు అంటేనే అతడి ముందు చూపు ఎలా ఉందో తెలుసుకోవచ్చు. 2017 మోర్గాన్, స్టాన్లీ నివేదిక ప్రకారం ఆదానీ స్పెషల్ ఎకనమిక్ జోన్ గ్లోబల్ పోర్ట్ కంపెనీల్లో 25 శాతం వాటాను ఆక్రమించిందని తెలిపింది. ఇలా చెప్పుకుంటూ పోవాలేగానీ ఆదానీ సృష్టించిన అద్భుతాలకు అంతు ఉండదు. కానీ ఒక్కటి సుస్పష్టం హిండెన్‌బర్గ్ రిపోర్ట్ మాయలో పడి మీడియా అసలు విషయాలను మరుగున పడేస్తోంది. ముందుగానే చెప్పినట్టు ఇవ్వాళ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఆదానీ తన అవసరాల నిమిత్తం బీజేపీకి వద్దకు వెళ్తాడు. రేపటినాడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దానికి అనుకూలంగా మారిపోతాడు. కార్పొరేట్లకు పైసలు మాత్రమే కావాలి. మిగతావి అనవసరం. చించుకుని చించుకుని మన గొంతు పోవడం తప్ప వేరే ఉపయోగం ఉండదు.