China: ఈడంతా పోయాక పెళ్లెందుకు.. ఆకలంతా పోయాక అన్నమెందుకు అనేది సామెత. ఏ వయసులో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ వయసులో జరగాలంటారు. అందుకే పదవి కోసం పరిణయం కోసం తొందర పడొద్దని కూడా చెబుతారు. కానీ చైనాలో మాత్రం పెళ్లికాని వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జీవితంలో స్థిరపడాలనే ఉద్దేశంతో పెళ్లి మాట ఎత్తకుండానే భవిష్యత్ పై భారీగా ఆశలు పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి కాని వారు పెరిగిపోతున్నారు.
గతంలో అయితే పెళ్లి చేసుకున్నాకే స్థిరపడాలని భావించేవారు. కానీ నేడు కాలంలో మార్పులు వస్తున్నాయి. ముందు స్థిరపడ్డాకే వివాహం జోలికి నేటి యువత వెళుతోంది. అందుకే పెళ్లి వయసు దాటిపోయినా సరే కానీ మొదట జీవితంలో నిలదొక్కుకోవాలని చూస్తున్నారు. చైనా ఇయర్ బుక్ 2021 ప్రకారం గత 17 ఏళ్లలోనే తక్కువ పెళ్లిళ్లు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశమే.
Also Read: చైనాలో ఆహార సంక్షోభం ఎందుకు..?
ఉద్యోగమైనా వ్యాపారమైనా జీవితంలో అనుకున్న లక్ష్యం నెరవేర్చుకున్నాకే వివాహం గురించి పట్టించుకుంటున్నారు. ఈ క్రమంలో వయసు భారం మాత్రం చూడటం లేదు. మరోవైపు పెరుగుతున్న ధరలతో అన్నింటా భారమే కలుగుతోంది. ఇల్లు కట్టుకోవాలని నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో యువత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అందుకే మంచి ఇల్లు కట్టుకున్నాకే పెళ్లి చేసుకోవాలని తలపిస్తున్నారు.
చైనాలో పురుషుల కంటే మహిళల సంఖ్యే తక్కువగా ఉంటోంది. దీంతో కూడా పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయి. జనాభాలో పురుషుల సంఖ్య పెరగంతో మహిళలు దొరకడం లేదు. ఈ క్రమంలో ఉన్న వారు సైతం తమ తాహత్తుకు సరితూగే వారినే చూసుకుంటున్నారు. దీంతో ఆర్థికంగా లేనివారు వివాహం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
Also Read: సినిమా టికెట్ల వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయం సమంజసమేనా?