చంద్రబాబు, నారాయణలపై సీఐడీ కేసులో హైకోర్టు సంచలన తీర్పు

మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబు తప్పించుకున్నారు. కీలకమైన అమరావతి కేసు విచారణ నుంచి చాకచక్యంగా బయటపడ్డారు. ఈ కేసు విషయంలో చంద్రబాబు వాదనే నెగ్గడం విశేషం. ఢిల్లీ నుంచి దిగ్గజ లాయర్లను తెప్పించి మరీ వాదించిన చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసు విచారణపై స్టే విధిస్తూ ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.. సీఐడీ నమోదు […]

Written By: NARESH, Updated On : March 19, 2021 9:07 pm
Follow us on

మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబు తప్పించుకున్నారు. కీలకమైన అమరావతి కేసు విచారణ నుంచి చాకచక్యంగా బయటపడ్డారు. ఈ కేసు విషయంలో చంద్రబాబు వాదనే నెగ్గడం విశేషం. ఢిల్లీ నుంచి దిగ్గజ లాయర్లను తెప్పించి మరీ వాదించిన చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.

రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసు విచారణపై స్టే విధిస్తూ ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.. సీఐడీ నమోదు చేసిన కేసులో మొత్తానికి బాబుకు ఊరట లభించింది.

సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ చంద్రబాబు, నారాయణ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. చంద్రబాబు తరుఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, నారాయణ తరుఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

సీఐడీ తరుఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. చంద్రబాబు , నారాయణ కేసులో సీఐడీ విచారణపై స్టే విధిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది.

*కేసు వివరాలివీ..

అమరావతి భూముల విషయంలో సీఐడీ నమోదు చేసిన కేసు రద్దు చేయాలని, అరెస్ట్‌తో పాటు తదుపరి చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ.. మంగళగిరి సీఐడీ ఠాణా స్టేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈ నెల 16న సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

సెక్షన్‌ 41సీఆర్‌పీసీ కింద నోటీసులు అందజేసి, ఈ నెల 23న విజయవాడలోని కార్యాలయంలో విచారణకు రావాలని సూచించారు. అలాగే టీడీపీ నేత, మాజీ మంత్రి పి.నారాయణ సైతం ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. ఆయనకు సైతం బుధవారం సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22న విచారణకు రావాలని నోటీసుల్లో ఆదేశించారు. మోసం, కుట్రతో అసైన్డ్‌ భూములు లాక్కున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత 24న సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రబాబు, నారాయణపై ఎస్సీ, ఎస్టీ చట్టం సహా 10 సెక్షన్ల కింద సీఐడీ అధికారులు ఈ నెల 12న కేసు నమోదు చేశారు.

చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 166, 167, 217, 120 (బీ) రెడ్‌ విత్‌ 34, 35, 36, 37, ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1), (ఎఫ్‌), (జీ), ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్న సీఐడీ.. మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణను ఏ2గా పేర్కొన్నారు. అలాగే కొంత మంది అధికారులు కూడా ఇందులో ఉన్నట్లు పొందుపరిచింది.