MP Raghu Rama Krishna Raju: వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన ఎంపీ రఘురామక్రిష్ణంరాజు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటీషన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్పింది. మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని ప్రత్యేక మార్జిన్ పేరిట కార్పొరేషన్‌కు మళ్లించి దాన్ని ఆదాయంగా చూపుతూ ప్రభుత్వం రుణాలు పొందడాన్ని సవాల్ చేస్తూ రఘురామ రాజు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను శాసించేందుకు మీరెవరంటూ ప్రశ్నించింది. ప్రభుత్వాలను న్యాయస్థానాలు నడిపించలేవని పేర్కొంది. ఫలానా విధానంలోనే రుణం పొందాలని మీరెలా చెబుతారని పిటిషనర్, వైసీపీ ఎంపీ రఘురామరాజును ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని శాసించడానికి మీరెవరని నిలదీసింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించేందుకు తామేమీ కంపెనీ సెక్రటరీలం కాదని, న్యాయమూర్తులమని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగా ఉందో లేదో ఆర్‌బీఐ, కాగ్ చూసుకుంటాయని తెలిపింది.
ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ తనకు వచ్చే ఆదాయాన్ని చూపి రుణం పొందితే.. ప్రజా ప్రయోజనాలకు ఎలా భంగం కలుగుతుందని నిలదీసింది. ఈ వ్యాజ్యాన్ని పరిశీలిస్తే.. ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగించకూడదని పిటిషనర్ కోరుకుంటున్నట్లు ఉందని, సంక్షేమ పథకాలు నిలువరించడం కోసం వేసిన ఈ పిటిషన్ ప్రజాప్రయోజన వ్యాజ్యం నిర్వచనంలోకి ఎలా వస్తుందని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో తామెందుకు జోక్యం చేసుకోవాలని వ్యాఖ్యానించింది.
ఈ తరహా వ్యాజ్యాలను ప్రోత్సహిస్తే రేపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్‌లను కూడా కోర్టుల్లో సవాల్ చేస్తారని పేర్కొంది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం స్పెషల్ మార్జిన్ పేరుతో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించి.. దానిని ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించలేమని తేల్చిచెప్పింది. ఇదో నిరర్థక వ్యాజ్యమని.. ఈ వ్యవహారంలో తాము తగిన ఉత్తర్వులు ఇస్తామని.. వాటిపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సలహా ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎ్‌సఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది.
ఎందుకంటే…
మద్యం అమ్మకాల ద్వారా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయాన్ని చూపించి ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేందుకు రాష్ట్రప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ చట్టం(1993)కి సవరణ చేస్తూ తీసుకొచ్చిన సవరణ చట్టాల(యాక్ట్ 31/2021, యాక్ట్ 9/2022)ను సవాల్ చేస్తూ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది.పిటిషనర్ తరఫున న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపించారు.
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమయ్యే మొత్తం సొమ్ములో 25శాతానికి మించి ప్రభుత్వం అప్పు చేయడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికే రుణపరిమితికి మించి అప్పులు చేసిందని.. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రత్యేక మార్జిన్ పేరుతో బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించి.. ఆ ఆదాయాన్ని తనఖా పెట్టి రుణం పొందుతోందన్నారు. కార్పొరేషన్ తాజాగా రూ.8 వేల కోట్ల రుణం పొందిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి చేసిన అప్పులపై కేంద్రం ఇప్పటికే వివరణ కోరిందని చెప్పారు. సంక్షేమ పథకాలను అడ్డుకోవాలన్నది తమ ఉద్దేశం కాదన్నారు. రాష్ట్రప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పుడు కోర్టులు జోక్యంచేసుకోవచ్చని తెలిపారు. పన్నుల రూపేణా వచ్చే ఆదాయాన్ని బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించడానికి వీల్లేదన్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘనగా పేర్కొన్నారు.
సుప్రీం కోర్టుకు..
అయితే పిటీషనర్ న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించలేదు. తాము జోక్యం చేసుకుంటే ప్రజాహితం కోసం ఉద్దేశించిన సంక్షేమ పథకాలు ప్రభావితం అవుతాయని అభిప్రాయపడింది. ఇక, కోర్టు నిర్ణయం పైన రఘురామ రాజు స్పందించారు. భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పులు చేయడాన్ని సవాల్ చేస్తే అందులో ప్రజాప్రయోజనం ఏముందని హైకోర్టు ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. హైకోర్టులో ఊహించినట్టే జరిగిందని.. ప్రజల తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రి తన భవిష్యత్తు కోసమే చూస్తున్నారని.. తాను మాత్రం ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించి న్యాయస్థానాన్ని ఆశ్రయించానని రఘురామ రాజు చెప్పుకొచ్చారు.
Also Read:South India sentiment- BJP: మళ్లీ సౌత్ ఇండియా సెంటిమెంట్.. బీజేపీకి గండమే