
విశాఖ వైద్యుడు సుధాకర్‌తో నడిరోడ్డుపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి, అరెస్టు చేసిన విషయంపై ఏపీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ప్రస్తుతం వైద్యుడు సుధాకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయన ఉన్న ఆసుపత్రికి వెళ్లి వాంగ్మూలం నమోదు చేయాలని విశాఖ సెషన్స్ జడ్జిని ఆదేశిస్తూ హైకోర్టులు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. రేపు సాయంత్రంలోగా వాంగ్మూలాన్ని హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
కరోనా నేపథ్యంలో తమకు మాస్కులు ఇవ్వకుండానే పనులు చేయమంటున్నారని, ఒక్కో మాస్కు చాలా రోజులు వాడమంటున్నారని ఆరోపించిన ప్రభుత్వ వైద్యుడు సుధాకర్‌ను అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం విశాఖపట్నంలో జాతీయ రహదారిపై ఆయన గొడవ చేస్తున్నారని పోలీసులు అరెస్టు చేయడం అలజడి రేపింది. అంతేకాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని 353, 427 సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.
సుధాకర్ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమించింది. అన్ని వైపులా నుంచి ఈ వ్యవహారంలో వత్తిడి పెరిగింది. దళిత సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం వైద్యుల సంఘం, హైకోర్టు, ఎస్సీ కమిషన్, మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై వత్తిడి తీసున్నాయి.