
సచివాలయం కూల్చివేతను సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరావు, ఎంపీ రేవంత్ రెడ్డ్లు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ కొనసాగింది. ప్రస్తుత భవనాలు మరమ్మతులకు వీలు లేకుండా ఉన్నాయని ఇలానే కొనసాగిస్తే నిర్వాణకే ఏటా రూ.5కోట్ల వరకు ఖర్చువుతుందని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ విషయం పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ అనిషేక్‌రెడ్డిల ధర్మాసనం విచారణ కొనసాగించింది. ప్రభుత్వం విధాన నిర్ణయాలను తీసుకున్నపుడు అవి చట్టబద్ధంగా, సహేతుకంగా ఉన్నపుడు ఆ అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను గుర్తుచేసింది.
ప్రస్తుతమున్న భవనాన్ని నవీకరించడానికి అవకాశం లేదని, కొత్తవి నిర్మించాలని నలుగురు ఇంజనీరింగ్ నిపుణులతో కూడిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. ఇంజనీర్ల కమిటీ ఆధారంగానే నూతన సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక వేసిందని ఏజీ పేర్కొనగా, ఇంజనీర్ల కమిటీ ప్రభుత్వం చెప్పినట్టే నివేదిక ఇస్తుందని పిటిషనర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తరఫున న్యాయవాది సత్యంరెడ్డి వాదించారు. ప్రభుత్వ ఆదేశాలతో నిపుణుల కమిటీ వారికి కావల్సినట్టే నివేదిక ఇచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు. సచివాలయం యథాతథ స్థితిని పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు స్వతంత్ర కమిటీని నియమించాలని న్యాయస్థానాన్ని కోరారు. భవనాల మరమ్మతులకు, విద్యుత్ సౌకర్యానికి, అగ్నిమాపక ప్రమాదాలు జరగకుండా చూడాలంటే అందుకు సంబంధించిన సాంకేతిక అంశాల జోలికి తాము పోలేమని, నిపుణుల కమిటీ నివేదికను తాము పరిగణనలోకి తీసుకుంటామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. నివేదిక ఎంత వరకూ వాస్తవం అనే అంశాల జోలికి తాము వెళ్లమని ఆ పని తమది కాదని పేర్కొన్నారు. సాంకేతిక అంశాల జోలికి తామెలా వెళ్తామని, తాము సాంకేతిక నిపుణులం కాదని ధర్మాసనం పేర్కొంది. ప్రతివాదుల వాదనలపై కౌంటర్ దాఖలుచేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.