
ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ నెల 4న జరుపతలపెట్టిన సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి తెలంగాణ హై కోర్ట్ బ్రేక్ వేసింది.
హైకోర్టు ఇచ్చిన గడువు శుక్రవారం వరకు ఉన్నా రైతుల్ని ముందే ఏప్రిల్ 30న రాత్రి 600 మంది పోలీసులతో వచ్చి బలవంతంగా ఖాళీ చేయించారని పిటీషనర్లు కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్వాసితులు చెప్పడంతో తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యిందని, ఈ నెల 4న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు వీలుగా నీటి విడుదలకు అనుమతి ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చేసిన అభ్యర్ధనను హైకోర్టు తోసిపుచ్చింది. విచారణను మే 7కి వాయిదా వేసింది.
బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసి మే 6 లోగా తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా జడ్జిని ఆదేశిస్తూ శుక్రవారం చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల, బైలంపూర్ గ్రామానికి చెందిన శ్యాంసుందర్‌రెడ్డి సహా 23 మంది ముంపు బాధిత రైతులు దాఖలు చేసిన రిట్లను హైకోర్టు శుక్రవారం మరోసారి విచారించింది.
లాక్‌డౌన్ తో కుప్పకూలుతున్న ప్రింట్ మీడియా
బాధితులను బలవంతంగా పునరావాస కేంద్రాలకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను బ్రిటీష్ రాణి ఏమీ నియమించలేదని, గుర్తుంచుకోవాలని హెచ్చరించింది.
ఆంధ్ర పాలకులు అణిచివేతకు గురిచేశారని చెప్పి.. తెలంగాణను సాధించుకున్న తర్వాత కూడా రాష్ట్ర పాలకులు అదే ధోరణిని అవలంబిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో వారిలాగే వ్యవహరిస్తే ఎలాగని నిలదీసింది.
వెయ్యిమంది పోలీసులు, 200 మంది అధికారులు, 500 మంది కూలీలు.. పదుల సంఖ్యలో అంబులెన్సులు యాబై డీసీఎంలు పదుల సంఖ్యలో జేసీబీలు, ప్రొక్లెయిన్లతో ఒక్కసారిగా కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాలైన మామిడ్యాల, బైలంపూర్లపై పడ్డారు. జామర్లు పెట్టి సెల్ ఫోన్ సిగ్నల్ బ్లాక్ చేయడమే కాకుండా నిర్వాసితుల నుంచి సెల్ ఫోన్లు లాక్కున్నారు. ఇండ్లలో దొరికిన సామగ్రిని దొరికినట్టు బయటకు తరలించి డీసీఎంలలో వేశారు.
అడ్డుకోబోయిన వారిని ఎక్కడికక్కడే నిలువరించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాల్లో గురువారం అర్ధరాత్రి మొదలైన ఈ కూల్చివేతలు.. తరలింపు కార్యక్రమం శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది.
మామిడ్యాల, బైలంపూర్ గ్రామాల నుంచి పరిహారం కోసం 53మంది కోర్టుకు వెళ్లారు. మే 1 వరకు ఖాళీ చేయవచ్చని కోర్టు వారికి సూచించింది. గడువు సమీపించడంతో అధికారులు బలవంతంగా నిర్వాసితులను ఇండ్ల నుంచి ఖాళీ చేయించారు. మామిడ్యాలలో 40, బైలంపూర్లో 13 ఇండ్ల తో పాటు ఇప్పటికే ఖాళీ చేసిన వాటిని సైతం కూల్చివేయడంతో ప్రస్తుతం అక్కడ మట్టిదిబ్బలే మిగిలాయి.