
నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గులేని జనాన్ని అని ఒకప్పుడు జనాల నిర్లక్ష్యంపై ఓ మంచి పాట రాశారు. కానీ ఇప్పుడా పాటను ‘ప్రభుత్వాల’పై రాసే పరిస్థితి వచ్చిందంటున్నారు. ఎందుకంటే దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. రాష్ట్రంలో తిరుపతి, నాగార్జున సాగర్, పరిషత్, మున్సిపల్ ఎన్నికల పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊరేగింపులు, సభలు, ప్రచారం చేయడంతో దేశంలో దెబ్బకు కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. ఒక ప్రజలు కరోనాను లైట్ తీసుకోవడం వారి ప్రాణాలకే ముప్పు తెచ్చింది. టోటల్ కంట్రోల్ చేయని ప్రభుత్వాలు.. ఈ టైంలో ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల కమిషన్ ఇప్పుడు దోషిగా నిలబడాల్సిన పరిస్థితుల్లో పడిపోయింది.
నిన్ననే మద్రాస్ హైకోర్టు దేశంలో కరోనా ఉధృతికి ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యమే కారణమని.. ఈసీపై హత్య కేసు పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సైతం కేసీఆర్ సర్కార్ ను నిగ్గదీసి అడిగింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లారని కోర్టు ఎస్ఈసీని ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా? అని కడిగేసింది.
ఆకాశం మీదపడినా.. ఎన్నికలు జరగాల్సిందేనా? ఎస్ఈసీ అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తున్నారా? అధికారులు భూమిపై నివసిస్తున్నారా? ఆకాశంలోనా అని తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
మొత్తం అటు ప్రభుత్వాన్ని, ఇటు ఎన్నికల కమిషన్ ను హైకోర్టు ఉతికి ఆరేసింది. ఈ టైంలో అన్ని అధికారాలు ఉన్నా ఎన్నికలు ఆపని ఈసీ అధికారులను విచారణకు హాజరు కావాలని సంచలన ఆదేశాలిచ్చింది.