BC 1 Lakh Scheme: బీసీలు.. తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ జనాభా వారిదే. జనాభాలో సగం కంటే మించి ఉన్నప్పటికీ ప్రభుత్వ ప్రయోజనాలపరంగా వారికి అందుతున్న అవకాశాలు అంతంత మాత్రమే. కేబినెట్లోనూ వారి వాటా తక్కువే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇవాల్టి వరకు బీసీలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ బీసీ లోనే దారిద్ర్య రేఖకు దిగువన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ వారిని ఇన్ని సంవత్సరాలపాటు ప్రభుత్వం ఆదుకోలేదు. కనీసం తోడ్పాటు కూడా అందించలేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడం, ప్రజావ్యతిరేకత ముఖ్యంగా బీసీల నుంచి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతుండడంతో కెసిఆర్ దాన్ని చల్లార్చడానికి “లక్ష రుణం” అనే పథకానికి శ్రీకారం చుట్టారు. మొన్నటితో ఈ పథకానికి సంబంధించిన గడువు పూర్తయింది. ఇక ఈ పథకంలోనూ ప్రభుత్వం విధించిన నిబంధనల వల్ల చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారు.. ఇక ఈ లక్ష రుణం మాట అటు ఉంచితే బీసీలకు కేసీఆర్ సర్కార్ చేసిన మోసం గురించి ఒక్కసారి ఈ కథనంలో చూద్దాం.
మోసం చేస్తూనే ఉంది
వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాల వారిని తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తూనే ఉంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు (2014-15 నుంచి 2022-23) స్వయం ఉపాధి రుణాల కోసం వారు చేసుకున్న దరఖాస్తుల్లో పరిష్కారం కానివాటన్నింటినీ రద్దు చేసింది. తాజాగా కులవృత్తులకు రూ.లక్ష సాయం పేరుతో కొత్త పథకాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. జూన్ 9న ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కొద్ది రోజులు గడువు మాత్రమే ఇచ్చి ముగించేశారు. చాలామంది లబ్ధిదారులు ఆదాయ ధ్రువీకరణ పత్రల కోసం మీసేవ కేంద్రాల వద్ద పడికాపులు కాశారు. ప్రభుత్వం వ్యూహాత్మకంగానే దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో రాకూడదనే ఉద్దేశంతో కొద్ది రోజులు మాత్రమే ఈ పథకానికి గడువు ఇచ్చింది. ఆదాయ ధ్రువీకరణ పత్రాలను కచ్చితంగా సమర్పించాలని నిబంధన విధించడంతో లబ్ధిదారులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేశారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ పథకానికి సంబంధించి జీవోఆర్టీ 764లో.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారినే ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. దీంతో స్వయం ఉపాధి రుణాల కోసం ఇప్పటివరకు బీసీ శాఖకు వచ్చిన 9 లక్షల దరఖాస్తులకు మంగళం పాడింది.
3.6 లక్షల దరఖాస్తులు
2014-15లో స్వయం ఉపాధి రుణాల కోసం 3.6 లక్షల దరఖాస్తులు రాగా.. 2018 నాటికి కేవలం 40 వేల మందికి రూ.50 వేల చొప్పున మాత్రమే ప్రభుత్వం సాయాన్ని అందించింది. ఆ తరువాత మళ్లీ ఇప్పటివరకు ఉపాధి రుణాల ఊసే ఎత్తలేదు. 2018 ఎన్నికల తర్వాత కూడా రుణాల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. పాతవి, కొత్తవి అన్నీ కలిపి 9 లక్షల దాకా దరఖాస్తులు ఉంటాయని అంచనా. వాటి సంగతి తేల్చకుండానే ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు కుల వృత్తులకు రూ.లక్ష సాయం అంటూ కొత్త పథకాన్ని ప్రకటించి.. కొత్తగా దరఖాస్తులు స్వీకరించి బీసీలను మోసం చేసింది. కుల వృత్తులకు రూ.లక్ష సాయం పథకం విధివిధానాలపై పథకం కోసం ఏర్పడిన కేబినేట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలు కూడా లబ్ధిదారుల నోట్లో మట్టి కొట్టే విధంగా ఉన్నాయి. దరఖాస్తు తేదీ, అమలు తేదీ, అర్హత వివరాలను మాత్రమే జీవోలో పేర్కొన్న ప్రభుత్వం.. దరఖాస్తులు స్వీకరించిన తర్వాత అసలు విషయాలను వెల్లడించడం విశేషం. అలాగే, ఎంతమందికి ఈ పథకాన్ని అందించనున్నారు, పథకం అమలుకోసం ఎన్ని నిధులు వెచ్చించనున్నారనే అంశాలను ఇప్పటివరకు కేబినేట్ సబ్ కమిటీ గోప్యంగా ఉంచుతోంది.
200 కోట్లు మాత్రమే
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుంటూ నిధుల సర్దుబాటు మేరకు పథకాన్ని అమలుచేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో భాగంగా మొదటి విడత కోసం రూ.200 కోట్లను బీసీ శాఖకు కేటాయించాల్సిందిగా ఆర్థిక శాఖకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకుండా తెరపైకి తీసుకొచ్చిన కొత్త పథకాన్ని విడతల వారీగా అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తుండడంతో.. ఈ పథకమైనా అందరికీ అందుతుందో లేదోనని కులవృత్తుల వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ ద్వారా బీసీలకు వివిధ కేటగిరీల్లో ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించిన సర్కారు ఆమేరకు నిధులను కేటాయించలేదు. గత తొమ్మిదేళ్లలో కేటాయించింది కేవలం రూ.2,139 కోట్లు మాత్రమే. 80 శాతం సబ్సీడితో హెయిర్ సెలూన్‌లు, వాషింగ్ మెషిన్లు, స్వయం ఉపాధి యూనిట్లు, టెంట్ హౌస్, ఫ్యాన్సీ స్టోర్లు, ఆటో ట్రాలీలను అందించాలని, 100 శాతం రాయితీతో కూరగాయలు, పండ్ల విక్రయం, టైలరింగ్ తదితరాలకు రూ.50 వేలను అందజేయాలని, 60 శాతం రాయితీతో ట్రాక్టర్, కారు, తదితరాలకురూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అందివ్వాలని నిర్ణయించినా అమలుకు నోచుకోలేదు. ఈ పథకాల కోసం 2017-18, 2018-19 బడ్జెట్‌లో ఏడాదికి రూ.1000 కోట్లు చొప్పున కేటాయింపులు చేసినా.. రూ.351.50 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. 2019-20 లో రూ.5 కోట్లు, 2020-21 నుంచి 2022-23 వరకు రూ.1,300 కోట్లను కేటాయించినా.. ఈ నాలుగేళ్లలో ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. 2014-15 నుంచి 2018-19 వరకు సమాఖ్యలకు రూ.448 కోట్లను విడుదల చేయగా, ఇందులో కేవలం రూ.230 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. ఇక 2019-20 నుంచి ఫెడరేషన్లనకు సర్కారు ఒక్క రూపాయి కేటాయించలేదు.