https://oktelugu.com/

వరుస భేటీలు స్టార్ట్‌ చేసిన షర్మిల..: పార్టీ ప్రకటన అప్పుడే..?

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెల వైఎస్‌ షర్మిల ఒక్కసారిగా పార్టీని పెట్టబోతున్నట్లు ప్రకటించి తెలంగాణలో రాజకీయ దుమారం రేపారు. ఇప్పుడు పార్టీ ఏర్పాటు దిశగా ఆమె కీలక అడుగులు వేస్తున్నారు. వీకెండ్‌లో బెంగళూరుకు వెళ్లిపోయిన ఆమె.. సోమవారం తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. లోటస్ పాండ్ వేదికగా షర్మిల ఇవాళ పలువురు కీలక వ్యక్తులు, ముఖ్యనాయకులతో వరుస భేటీలు నిర్వహించారు. ఆమెతో సమావేశం తర్వాత ఒకరిద్దరు నాయకులు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 16, 2021 / 10:09 AM IST
    Follow us on


    ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెల వైఎస్‌ షర్మిల ఒక్కసారిగా పార్టీని పెట్టబోతున్నట్లు ప్రకటించి తెలంగాణలో రాజకీయ దుమారం రేపారు. ఇప్పుడు పార్టీ ఏర్పాటు దిశగా ఆమె కీలక అడుగులు వేస్తున్నారు. వీకెండ్‌లో బెంగళూరుకు వెళ్లిపోయిన ఆమె.. సోమవారం తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. లోటస్ పాండ్ వేదికగా షర్మిల ఇవాళ పలువురు కీలక వ్యక్తులు, ముఖ్యనాయకులతో వరుస భేటీలు నిర్వహించారు. ఆమెతో సమావేశం తర్వాత ఒకరిద్దరు నాయకులు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ స్థాపన తేదీపైనా మరికొంత సమాచారం వెల్లడైంది.

    Also Read: ‘సోము’.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చేనా..?

    జగన్‌తో షర్మిల విభేదాలపై ఆమె ముఖ్య అనుచరులు కీలక ప్రకటన విడుదల చేశారు. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత వైఎస్ షర్మిల తిరిగి హైదరాబాద్ చేరడంతో లోటస్ పాండ్‌లో మరోసారి సందడి వాతావరణం కనిపించింది. పార్టీ ఏర్పాటు దిశగా.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ప్రముఖులు, వైఎస్ అభిమానులతో షర్మిల వరుసగా సమావేశమవుతున్నారు. సోమవారం షర్మిలతో భేటీ అయినవారిలో ప్రముఖ జర్నలిస్టు, జగన్ సర్కారు మాజీ సలహాదారు కె.రామచంద్రమూర్తి కూడా ఉండటం విశేషం. తెలంగాణలో ప్రారంభించబోయే కొత్త పార్టీ విధివిధానాలు, వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశాలపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. గతవారం వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా హైదరాబాద్ వచ్చి షర్మిలను కలవడం తెలిసిందే.

    జగన్ సర్కారు మాజీ సలహాదారు రామచంద్రమూర్తితోపాటు షర్మిలను కలిసివారిలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, నల్గొండ డీసీసీ మాజీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి తదితర ప్రముఖులు కూడా ఉన్నారు. వైఎస్ అభిమానులుగానో, తాను పెట్టబోయే పార్టీకి సమర్థకులుగానో ముందుకొచ్చే నేతలతో మొదట ఆత్మీయ సమావేశాలు నిర్వహించి, ఆ తర్వాతే పార్టీ ప్రకటన చేయాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ స్థాపన నుంచి అన్ని వ్యవహారాలు లోటస్‌పాండ్‌ వేదికగానే నడిపించబోతున్నట్లు తాజాగా వెల్లడవుతోంది.

    వైఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించి, ఇప్పుడు కాంగ్రెస్ సహా వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్న కొందరు నేతలకు లోటస్‌పాండ్‌ నుంచి ఫోన్లు చేసి పార్టీలో చేరాలంటూ ఆహ్వానాలు పంపుతున్నట్లు సమాచారం. లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిలను కలిసిన తర్వాత కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని, ఆయన సమైక్యవాదాన్ని మోస్తున్న షర్మిలకు ఇక్కడ రాజకీయంగా ఆదరణ ఉండబోదంటూ కొందరు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్లపై రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ ఈ లోకంలో లేకపోయినా, వారి పిల్లలు ప్రజల కోసం మంచి పనులు చేస్తున్నారని కితాబునిచ్చారు.

    Also Read: స్వస్థలాలకు మంత్రుల పరుగులు

    ‘షర్మిల కొత్త పార్టీని ఆహ్వానిస్తున్నాం. రాజకీయాలు ఎవరి సొత్తూ కాదు. ఎవరైనా పార్టీ పెట్టవచ్చు. తెలంగాణలో పనిచేసేందుకు వస్తున్న మహిళను ప్రజలు స్వాగతించాలి. దేశంలో ఎక్కడ పుట్టినా.. ఎక్కడైనా పనిచేయవచ్చు. తమిళనాడు సీఎంగా పనిచేసిన జయలలిత స్వస్థలం కేరళ. షర్మిల మాజీ సీఎం కుమార్తె. షర్మిల తెలంగాణ బిడ్డ. ఈ గడ్డ మీదే పుట్టింది. నిజానికి కేసీఆర్ తెలంగాణ బిడ్డ కాదు. టీఆర్ఎస్ కీలక నేత, ఎంపీ కేశవరావు(కేకే) తండ్రి కూడా ఆంధ్ర నుంచి వలస వచ్చారు. కాబట్టి షర్మిల గురించి అవాకులు చెవాకులు పేలడం, ఇష్టానుసారంగా మాట్లాడటం మానుకోవాలి’ అని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి అన్నారు.

    అయితే.. షర్మిల కొత్త పార్టీ ప్రకటనకు సంబంధించి రెండు తేదీలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వైఎస్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మే 14 తేదీన గానీ, వైఎస్సార్ జయంతి అయిన జూలై 8న గానీ కొత్త పార్టీని ప్రకటించాలని షర్మిల యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జులై వరకు ఆగడం కంటే, మే 14న పార్టీని ప్రకటించేసి, వెనువెంటనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర కూడా ప్రారంభిస్తే బాగుంటుందని షర్మిలను కలిసిన నేతలు ఆమెకు సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. షర్మిలకు సంబంధించి వార్తలను ముందుగానే బ్రేక్ చేసిన ఓ మీడియా సంస్థ మాత్రం ఏప్రిల్‌లోనే ప్రకటన ఉండొచ్చని చెబుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్