Heavy Rains In AP: వాయుగుండం.. మరింత కుండపోత వర్షం.. అరెంజ్ అలెర్ట్ జారీ

ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. కర్నూలు, నంద్యాల, పల్నాడు, ఎన్టీఆర్‌, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో బుధవారం కుంభవృష్టి కురిసే అవకాశముంది.

Written By: Dharma, Updated On : July 26, 2023 10:38 am

Heavy Rains In AP

Follow us on

Heavy Rains In AP: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. అన్ని ప్రాంతాలు తడిసి ముద్దవుతున్నాయి. అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకూ తెలంగాణాను వర్సాలు వణికించాయి. ఇప్పుడు ఏపీలో ప్రతాపం చూపిస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నదులు రికార్డుస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరద పోటు అధికంగా ఉంది. సముద్రం సైతం అల్లకల్లోలంగా మారింది. ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది బుధవారానికి వాయుగుండంగా మారనుంది. తరువాత ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మీదుగా వాయువ్య దిశలో పయనిస్తూ మధ్య భారతం వైపు వెళ్లనుంది. దీనికితోడు విశాఖపట్నం మీదుగా తూర్పు, పడమర ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారి కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల భారీ వర్షపాతం నమోదైంది.

ఈ ఏడాది ఏపీలో సుదీర్ఘ వేసవి నడిచింది. జూలై మూడో వారం వరకూ వర్షాల జాడలేకుండా పోయింది. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు రుతుపవనాల రాక ఆలస్యంగా మొదలైంది. అయితే ఎట్టకేలకు వర్షాలు ప్రారంభమయ్యాయి. కానీ రికార్డు స్థాయిలో నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం రాష్ఠ్ర వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండలో అత్యధికంగా 103.5 మిల్లీమీటర్లు, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 80 మిల్లీమీటర్లు, విశాఖ జిల్లా మధురవాడలో 52 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. బుధ, గురువారాల్లో సైతం రాష్ట్ర వ్యాప్తంగా అతిభారీ నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. భారీగా ఉరుములు, పిడుగులు పడతాయని హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లకూడదని సూచించింది.

ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. కర్నూలు, నంద్యాల, పల్నాడు, ఎన్టీఆర్‌, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో బుధవారం కుంభవృష్టి కురిసే అవకాశముంది. వాతావరణ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. . ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలతోపాటు పిడుగులు, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. బాపట్ల, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, పిడుగులు, ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అనంతపురం, కడప, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు, ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అటు ప్రభుత్వం సైతం ఆయా జిల్లాల యంత్రాంగాలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.