మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీ–-సింఘు సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతున్నది. 35 మంది రైతులు పోరాటంలో ప్రాణత్యాగం చేసినా, రైతులు చలించకుండా శాంతియుతంగా ఉద్యమిస్తున్నారు. ఢిల్లీ- హర్యానా సరిహద్దుల్లోని సింఘు, టిక్రీ, పల్వాల్, ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లోని నోయిడా, ఘాజీపూర్ ప్రాంతాల్లో రోడ్లన్నీ గ్రామాలను తలపిస్తున్నాయి.
Also Read: ఆ వ్యాక్సిన్లకు జెట్ స్పీడ్‌లో పర్మిషన్..: వారంలోనే వ్యాక్సినేషన్
సింఘు ప్రాంతంలో సుమారు 40 కిలోమీటర్ల వరకు గుడారాలు, టెంట్లు, తాత్కాలిక గుడిసెలు వెలిశాయి. భారీ ఎత్తున జరిగే జాతరలను తలపించేలా జనసంద్రం కనుచూపు మేర ఇసుక పోస్తే రాలనంతగా ఉన్నది. ప్రతిరోజూ మద్దతు తెలియ జేసేందుకు వేలాది మంది అక్కడకు చేరుతున్నారు. 2020 డిసెంబర్ 8న భారత్ బంద్‌తో రైతు ఉద్యమం రూపు రేఖలు మారిపొయ్యాయి. గడిచిన 2 శతాబ్దాల్లో ఎన్నడూ జరగనంతగా రైతు ఉద్యమం ఉప్పెనలా ఎగసిపడుతున్నది.
రైతుల ఆందోళన 39వ రోజుకు చేరింది. ఓ వైపు వణికించే చలికి నేటి తెల్లవారుజాము నుంచి వర్షం కూడా తోడైంది. అయినా రైతులు లెక్కచేయడం లేదు. గుడారాల్లోకి చేరి తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చట్టాల రద్దు చేసే వరకూ నిరసన ఆపేది లేదని తేల్చి చెబుతున్నారు.
Also Read: 5న ఢిల్లీకి రాహుల్.. పీసీసీపై అయోమయం..!
మరోవైపు సోమవారం కేంద్రంతో రైతు సంఘాలు ఏడో దఫా చర్చలు జరగబోతున్నాయి. సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధతపై చర్చించనున్నారు. ఈసారి చర్చలు సఫలం కాకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతులు ఇప్పటికే ప్రకటించారు. అలాగే.. జనవరి 6న ట్రాక్టర్ల ర్యాలీ, జనవరి 26న ట్రాక్టర్లతో కవాతు నిర్వహించాలని నిర్ణయించారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్