తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు కరోనా మహమ్మరి విజృంభిస్తుంటే మరోవైపు అకాల వర్షాలు అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేసున్నాయి. పంట దిగుబడులు చేతికొచ్చే సమయంలో దేశంలో కరోనా ఎంట్రీతో రైతన్న పరిస్థితి అగమాగం అవుతోంది. కేంద్రం లాక్డౌన్ అమలు చేయడంతో ప్రజా రవాణా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. దీంతో పంటలను కోసేందుకు కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో ప్రతీగింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం కన్పించడం లేదని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ సెంటర్లలో సరైన సదుపాయాలు లేకపోవడంతో దిగుబడులను ఎలా కాపాడుకోలేకపోతున్నట్లు అన్నదాతలు వాపోతున్నారు.
అకాల వర్షాలు అన్నదాతకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మూడురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండొచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ ఛత్తీస్ గడ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని చెప్పారు. దీని ప్రభావంతో నేడు(మంగళవారం), రేపు(బుధవారం), ఎల్లుండి(గురువారం) వర్షాలు కురుస్తాయని తెలిపారు. తెలంగాణ, దక్షిణ కొస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.
దక్షిణ అండమాన్ సముద్రం ప్రాంతంలో ఈనెల 30న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 48గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారొచ్చని చెప్పింది. ఈమేరకు రైతులు, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రైతులు పంట దిగుబడులపై ముందస్తుగా టర్ఫాలిన్లు కప్పుకోవాలని సూచించింది.