i
ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క.. కేసీఆర్ కొడుకు వచ్చాడు.. మాటల బాంబులు పేల్చాడు.. దీంతో తెలంగాణ రాజకీయవర్గాల్లో మంటలు చెలరేగాయి. ఇక ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని సీఎం కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ డిసైడ్ అయ్యారు. వాళ్లు కౌంటర్ ఇస్తే.. ఇక ఎన్ కౌంటర్ చేయడమే అని నిరూపించారు. ఓ వైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్ళలకు గట్టి బదులిచ్చి కేటీఆర్ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడీ వ్యవహారం తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
మంత్రి కేటీఆర్ ఎన్నడూ లేనంతగా రెచ్చిపోయారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి , బీజేపీ చీఫ్ బండి సంజయ్ లకు గట్టి కౌంటర్లు ఇచ్చారు. వీరిద్దరి పాదయాత్రలపై సెటైర్లు వేశారు. మధ్యలో షర్మిలను చెడుగుడు ఆడేశాడు. ముందుగా రేవంత్ రెడ్డిని కేటీఆర్ తగులుకున్నాడు. ఆయన గతంలో టీడీపీలో ఉండగా సోనియాను అన్న మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించి ఆయనను ఇరుకునపెట్టారు. ఇటీవలే ‘తెలంగాణ తల్లి సోనియా’ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నాక రేవంత్ రెడ్డి అన్న సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఇదే రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండగా సోనియాగాంధీని ఎన్ని తిట్లు తిట్టాడో యూట్యూబ్ లో కొడితే వస్తాయని కేటీఆర్ చెప్పుకొచ్చాడు.. ‘ఆమె తెలంగాణ తల్లి కాదు.. తెలంగాణలో 1200 మందిని చంపేసిన బలిదేవత అన్నాడు. ఈరోజు ఆమెను తెలంగాణ తల్లి అంటున్నాడు.. ఇలానే వదిలేస్తే రేపోమాపో చంద్రబాబు నాయుడిని కూడా తెలంగాణ తండ్రి అంటాడు’ అని మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే రేవంత్ కు ఓ పదవి దొరికిందని.. ఓ 2 రోజులు ఇలానే హంగామా చేస్తారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటికీ టీడీపీలో ఉన్నట్టే ఫీల్ అవుతున్నాడని కేటీఆర్ సైటర్లు వేశారు.
ఇక బండి సంజయ్ పాదయాత్ర చేస్తానంటున్నాడని.. ఆయన ఏ ఊరికి పోయినా గత కాంగ్రెస్ ప్రభుత్వంతో శిథిలమైన గ్రామాలు ఎలా మారాయో కనిపిస్తుందని.. మేం చేసిన అభివృద్ధి ఆయన్ను స్వాగతం పలుకుతుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. బండి సంజయ్ ఈ ఏడేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకు ఏం చేసాడో పాదయాత్ర సందర్భంగా చెప్పాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ , విభజన హామీలు, ఒక్క జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వని బీజేపీని ప్రజలు అడుగడుగునా నిలదీయాలని కోరారు.
ఇక షర్మిల పాదయాత్రపై సెటైర్లు వేశారు. ఇంకా ఆంధ్రా పార్టీలు, నేతలు తెలంగాణకు అవసరమా? అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. మొత్తంగా నిన్నటితో టీఆర్ఎస్ స్టాండ్ కూడా మారిందని అర్థమవుతోంది. ఇక టీఆర్ఎస్ పై విమర్శలకు ఏమాత్రం మోహమాటపడవద్దని కౌంటర్లు ఇస్తూనే ఉండాలని.. రేవంత్, బండి సంజయ్, షర్మిల ఎవరిని వదిలిపెట్టేది లేదని తేటతెల్లమైంది.