Mallikarjun Kharge: 24 సంవత్సరాల తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర కుటుంబానికి చెందిన మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడు అయ్యారు. శశి థరూర్ మీద పోటీకి దిగి ఏకంగా 7897 ఓట్లు సాధించారు. ఇది ఏ రకంగా చూసినా మల్లికార్జున నాయకత్వం మీద పార్టీ శ్రేణులకు నమ్మకం ఉన్నట్టే కనిపిస్తోంది. గాంధీల కుటుంబానికి వీర విధేయుడుగా ఉన్న మల్లికార్జున.. ఎఐ సి సి అధ్యక్షుడు అయ్యేంతవరకు ఎటువంటి రాజకీయ ప్రయాణం కొనసాగించారు? ఎందుకు ఇప్పటివరకు కాంగ్రెస్ అధికారిక వెబ్సైట్లో చోటు దక్కించుకోలేకపోయారు? ఈ ఇంట్రెస్టింగ్ విషయాల సంగతేందో తేల్చేద్దాం పదండి.

స్వాతంత్రం వచ్చిన తరువాత ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయిన రెండో దళిత నేత మల్లికార్జున ఖర్గే అని ,తొలినేత జగజ్జీవన్ రామ్ అన్ని పత్రికల వెబ్ సైట్లు రాశాయి .. ఇది తప్పు. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయిన తొలి దళిత నేత దామోదరం సంజీవయ్య. 1962 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రేస్ గెలిచింది,ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న నీలం సంజీవ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. దీంతో ఏఐసీసీ పదవికి సంజీవ్ రెడ్డి రాజీనామా చేయగా దామోదరం సంజీవయ్య ఏఐసీసీ అధ్యక్షుడు అయ్యారు. ఎందుకనో గాని ఈ విషయం కాంగ్రెస్ వెబ్ సైట్ లో కూడా లేదు. వికీపీడియాలో కూడా లేదు. నారిశెట్టి ఇన్నయ్య రాసిన ” పొలిటికల్ హిస్టరీ ఆంధ్ర ప్రదేశ్” అనే పుస్తకంలో సంజీవయ్య ఏఐసీసీ పదవి గురించి రాశారు. కాంగ్రెస్ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా 1985లో ఏఐసీసీ అధ్యక్షుల ఫొటోలతో విడుదల చేసిన పోస్టల్ స్టాంపులో దామోదరం సంజీవయ్య ఉన్నారు.
దేశంలో తొలి దళిత సీఎం దామోదరం సంజీవయ్య. పెన్షన్ స్కీం మొదలు పెట్టింది సంజీవయ్య. సంజీవయ్య 1960లో సీఎం అయ్యారు. అప్పటికి ఆయనే యంగెస్ట్ సీఎం (39 సంవత్సరాలు).
మల్లిఖార్జున్ ఖర్గే వయస్సు 80 సంవత్సరాలు. ఈ వయస్సులో అధ్యక్ష పదవి అవసరమా అనిపిస్తుంది కానీ నిఖార్సైన నేత.
దేవరాజ్ అర్స్ శిష్యుడు
తొలినాళ్లలో దేవరాజ్ అర్స్ శిష్యుడిగా రాజ్జకీయాలు నేర్చుకున్న ఖర్గే.. కర్ణాటకకు 20 ఏళ్ళ కిందటే సీఎం కావలసింది. ముఖ్యంగా 2004లో జేడీఎస్ కాంగ్రెస్ కూటమి తరుపున ఖర్గే కచ్చితంగా సీఎం అవుతాడని ప్రచారం జరిగింది. కానీ చివరి నిముషంలో ధరమ్ సింగ్ సీఎం అయ్యారు.
వరుసగా పదకొండు ఎన్నికలు (తొమ్మిది సార్లు ఎమ్మెల్యే , రెండుసార్లు ఎంపీ ) గెలిచిన ఖర్గే 2014-2019 మధ్య లోకసభలో ప్రతిపక్ష నాయకుడుగా వ్యవహరించారు.2019 ఎన్నికల్లో ప్రత్యేక దృష్టి పెట్టి ఖర్గేను బీజేపీ ఓడించింది. మొన్నటి తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీచేసిన కర్ణాటక కేడర్ మాజీ ఐఏఎస్ రత్నప్రభ వల్లే ఖర్గే ఓడిపోయారు.

కర్ణాటక చీఫ్ సెక్రెటరీ గా పదవి విరమణ చేసిన రత్నప్రభ 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంలో మార్చి 2019లో బీజేపీలో చేరారు. 1972 నుంచి 2014 వరకు ఎమ్మెల్యే,ఎంపీ గా వరుసగా పదకొండు ఎన్నికల్లో గెలిచి 2014-2019 మధ్య లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరించిన మల్లిఖార్జున ఖర్గే ను 2019 ఎన్నికల్లో ఓడించాలన్న లక్ష్యంతో బీజేపీ రత్నప్రభ ను కాల్బుర్గి(పాత గుల్బర్గ) నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేయించింది
కలెకర్ట్ గా ఆ ప్రాంతంలో మంచి పరిచయాలున్న రత్నప్రభ ప్రభావం, అమిత్ షా స్థాయిలో చేసిన వ్యూహ రచన,యడ్యూరప్ప ప్రత్యేక దృష్టి వెరసి మల్లికార్జున ఖర్గే ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వాస్తవంగా రత్నప్రభే బీజేపీ అభ్యర్థి కావలసింది. కానీ చివరి నిముషంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమేష్ జాదవ్ బీజేపీలో చేరటంతో బీజేపీ ఆప్రాంతంలో మంచి పలుకుబడి ఉన్న ఉమేశ్ జాదవ్ నే మల్లికార్జున ఖర్గే మీద పోటీకి దించి ఓడించింది. అయితే ఇంతటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న దళిత నేత మల్లికార్జున ఖర్గే వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి జవసత్వాన్ని అందిస్తారో వేచి చూడాల్సి ఉంది.