గడిచిన కొన్నాళ్లుగా విశాఖ వైసీపీ రాజకీయాలు వేడెక్కాయి. పార్టీ సీనియర్ నాయకుడు, ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్‌చార్జి విజయసాయి రెడ్డి కేంద్రంగా వైసీపీ నాయకులు, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. భూములు ఆక్రమించారని, సాయిరెడ్డి అల్లుడు.. ఇక్కడ ఫార్మా, ఐటీ కంపెనీలను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారని నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల అత్యంత కీలకమైన నాయకుడు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కూడా విరుచుకుపడ్డారు.
Also Read: ఇంతకీ తెలంగాణలో జనసేన అధినేత ఎటువైపు..?
తప్పులు చేస్తోందెవరో.. తేల్చేయాలి అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇదంతా కూడా సాయిరెడ్డిని దృష్టిలో పెట్టుకునే చేశారనేది ప్రచారం నడుస్తూనే ఉంది. పార్టీలో కీలక నేత, తన తర్వాత పార్టీని నడిపిస్తున్న నాయకుడిగా ఉన్న సాయిరెడ్డిపై తనకు వ్యక్తిగతంగా కావాల్సిన నాయకులే విమర్శలు చేయడంతో ఈ వివాదం మరింత ముదురుతుందనుకున్న సీఎం జగన్.. వెంటనే వారిని తాడేపల్లికి పిలిచి చర్చించారు.
జగన్ సీక్రెట్‌గా చేపట్టిన ఈ చర్చలపై రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాన మీడియాలో వచ్చిన ప్రకారం.. సీఎం జగన్ నేతలకు సర్దిచెప్పారు అనే వాదనను వైసీపీ సీనియర్లు కొట్టిపారేస్తున్నారు. ఇది అసలు చర్చకే రాలేదని.. జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. ఏకపక్షంగానే జగన్ మాట్లాడారని.. సాయిరెడ్డికే పగ్గాలు అప్పగిస్తున్నామని, అంతా ఆయన కనుసన్నల్లోనే ఉండాలని, ఇష్టమైతే పార్టీలో ఉండండి లేకపోతే, తలోదారి చూసుకోండి అని గట్టిగానే హెచ్చరించినట్టు చెబుతున్నారు.
Also Read: హతవిధీ.. ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నను పట్టించుకునే వారే లేరా?
ఇందులో సాయిరెడ్డి తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని కూడా చెబుతున్నారు. దీంతో ఇప్పటి వరకు సాయిరెడ్డి అంటే ఒక విధమైన భావనతో ఉన్న నేతలకు గట్టి సంకేతాలనే పంపించారని సీనియర్లు అంటున్నారు. మొత్తంగా ఈ ఎపిసోడ్‌లో సాయిరెడ్డిపై మరక పడకుండా జగన్ కాపాడేశారని చెబుతున్నారు. దీంతో విశాఖ వైసీపీ నేతల నోళ్లకు తాళం పడడం ఖాయమని అంటున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్