HCL Shiv Nadar: డబ్బు అనేది మనిషి జీవితాన్ని నిర్దేశిస్తుంది. ప్రపంచ గమనాన్ని శాసిస్తుంది. అందువల్లే డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది. డబ్బుతోనే మనిషి జీవితం సాగుతుంది.. ఈ భూమండలంలో డబ్బు అనేది అందరికీ అవసరం.. ఆ డబ్బును సంపాదించడానికి చాలామంది చాలా మార్గాలు అనుసరిస్తుంటారు.. అయితే కొంతమంది మాత్రం డబ్బు సంపాదనను అలవాటుగా మార్చుకొని.. దానికోసం ఎంత కష్టమైన పడతారు. చివరికి ఊహించిన డబ్బును సంపాదించి ప్రపంచాన్ని శాసిస్తారు. ఇలా ప్రపంచాన్ని శాసిస్తున్న వ్యాపారులను మన దేశానికి చెందిన శివ్ నాడార్ ఒకరు. హెచ్ సీ ఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడిగా ఆయన సుపరిచితులు.. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఆయన.. తన వారసురాలిగా కుమార్తె రోషిని నాడార్ ను ప్రకటించారు.
కుమార్తె ఇప్పటికే ఆయన వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలలో తల మనకులై ఉన్నారు. నాడార్ సంపాదనలోనే కాదు.. దానంలో కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంటారు. చిన్నప్పుడు ఆయన చాలా సూక్ష్మస్థాయిలో జీవితాన్ని మొదలుపెట్టారు. నేడు ఈ స్థాయిలో ఎదిగారు.. ఆయన కష్టాలను దగ్గరుండి చూశారు కాబట్టి.. కష్టాలలో ఉన్న మనుషులను చూస్తే తట్టుకోలేరు. అందువల్లే తనకున్న సంపాదనలో కొంత భాగాన్ని దానం చేస్తుంటారు. అందువల్లే మన దేశంలో అత్యధిక విరాళాలు ప్రకటించిన వారి జాబితాలో నాడార్ కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. ఈయన కుటుంబం ఈ ఏడాది ఇప్పటివరకు 2708 కోట్లను విరాళంగా ఇచ్చింది. గడిచిన ఐదు సంవత్సరాలలో నాలుగుసార్లు ఆయన దాతృత్వ జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. నాడార్ తర్వాత స్థానంలో ముకేశ్ అంబానీ ఉన్నారు. ఈయన 626 కోట్లను విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత బజాజ్ 446 కోట్లతో మూడో స్థానం.. 440 కోట్లతో బిర్లా నాలుగో స్థానం, 386 కోట్లతో అదాని, 365 కోట్లతో నందన్ , 298 కోట్లతో హిందుజా, 204 కోట్లతో రోహిణి తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
విద్య, వైద్యం, మౌలిక వసతులు, వ్యక్తిగత పరిశుభ్రత వంటి విభాగాలలో హెచ్సీఎల్ కంపెనీ భారీగా విరాళాలు ఇస్తూ ఉంటుంది. విద్యార్థుల్లో సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేయడానికి తమ సంస్థ ఆధ్వర్యంలో కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింది. అందులో నైపుణ్యం సంపాదించిన వారికి తమ కంపెనీలలో ఉద్యోగాలు కూడా ఇస్తోంది. అందువల్లే నాడార్ మనదేశంలో ఈ కాలపు కర్ణుడిగా పేరుపొందారు.
హెచ్సిఎల్ కంపెనీ మనదేశంలోనే కాకుండా.. ఇతర దేశాలలో కూడా కార్యకలాపాలు సాగిస్తోంది. ఐటీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. అనేక మల్టీనేషనల్ కంపెనీలకు సాఫ్ట్వేర్ సేవలు అందిస్తుంది. అమెరికా నుంచి మొదలు పెడితే యూరప్ దేశాల వరకు ఈ సేవలు అందిస్తుంది హెచ్ సి ఎల్. ప్రతి ఏడాది సమ్మిళితమైన ఆర్థిక అభివృద్ధిని సాధిస్తూ ఉంటుంది. అందువల్లే ఈ కంపెనీ మనదేశంలో టాప్ 5 ఐటీ సంస్థలలో ఒకటిగా ఉంది.