Homeజాతీయ వార్తలుతండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్ ఎలా ఎదిగారు?

తండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్ ఎలా ఎదిగారు?

Happy Birthday to KTR
అది 2009 టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడిగా కేటీఆర్ రాజకీయ అరంగేట్రం చేసిన రోజులు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లను ఎంచుకున్నారు. అక్కడ టీఆర్ఎస్ ఇన్ చార్జి మహేందర్ రెడ్డిని పక్కనపెట్టి కేటీఆర్ పోటీచేశారు. రెబల్ గా బరిలోకి దిగిన మహేందర్ రెడ్డి.. కేటీఆర్ కు సిరిసిల్లలో మూడుచెరువుల నీళ్లు తాగించాడు. ఓటమి అంచున నిలబెట్టారు. ఎట్టకేలకు కేటీఆర్ కేవలం 171 ఓట్లతో బతుకుజీవుడా అంటూ గెలిచాడు. అలాంటి కేటీఆర్ మొన్నటి 2019 ఎన్నికల్లో ఏకంగా 96వేలకు పైగా మెజార్టీ సాధించారు. ఇలా ఒక చిన్న నేతగా మొదలైన కేటీఆర్ ప్రస్థానం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను.. ప్రభుత్వాన్ని శాసించే నంబర్ 2 స్థానం వరకు ఎలా సాగిందో తెలుసుకుందాం.. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై స్పెషల్ ఫోకస్..

నాన్న పరిచిన బాట.. సులువుగానే రాజకీయ అధికారం దక్కింది. కానీ నడిపించేది నాన్న కాదు.. కేవలం ప్రోత్సాహాన్ని మాత్రమే ఇచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా.. మంత్రిగా నిరూపించుకొని కేటీఆర్ ఇప్పుడు తిరుగులేని ఖ్యాతిని సంపాదించారు. తెలంగాణలో రెండోసారి అధికారం చేపట్టిన కేసీఆర్ గత ఏడాది   డిసెంబర్ 17న కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పజెప్పి సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా  కేటీఆర్  అటు పార్టీలో.. ఇటు ప్రభుత్వంలోనూ చెరగని ముద్ర వేశారు.

కేటీఆర్ రాజకీయ ప్రవేశమే ఆసక్తిగా మొదలైంది. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదులుకొని 2006లో క్రియాశీల రాజకీయాల్లోకి కేటీఆర్ వచ్చారు. 2008లో 39మందిలో ఒకడిగా టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2009లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేవలం 171 ఓట్ల  మెజార్టీతో అతి కష్టం మీద గెలిచారు. ఆ తర్వాత జరిగిన 2010,2014,2018 ఎన్నికల్లో  వరుసగా గెలిచారు. తెలంగాణ ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.

కేటీఆర్ గడిచిన ఆరున్నరేళ్లలో మంత్రిగా ఐటీపై చెరగని ముద్రవేశారు. ఐటీని ప్రోత్సహించడానికి దేశాలు తిరిగారు. దిగ్గజ సంస్థలను కలిసి కీలక నిర్ణయాలు తీసుకొని తెలంగాణ ఐటి పురోభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. కేటీఆర్ ప్రారంభింపచేసిన టీహబ్, ఐటీ రంగం అభివృద్ధికి దోహదపడింది. ఇక మిషన్ భగీరథ, గ్రామ జ్యోతి వంటి పథకాలను అమలు చేసిన కేటీఆర్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.

కేటీఆర్ రాజకీయంగానూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తనను తాను నిరూపించుకున్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సొంతంగా 99 సీట్లు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా 55 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేసి టీఆర్ఎస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యాక జరిగిన  జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ పార్టీని విజయతీరాలకు చేర్చారు.  పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆశించిన విజయాలను సొంతం చేసుకోలేకపోయారు.ఇక పార్టీ సభ్యత్వాన్ని 60 లక్షలు దాటించి, బూత్, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. ఇక త్వరలోనే 22 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలను చేపట్టారు.

కేటీఆర్.. గడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖమంత్రిగా ఎన్నో సంస్కరణలు అమలు చేసి ఎంతో పేరు సంపాదించారు. చాలా స్టిక్ట్ గా వాటిని ఆచరణలో పెట్టి ప్రజల మనసు చూరగొన్నారు. కేటీఆర్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా జాతీయంగా.. అంతర్జాతీయంగా తనదైన ముద్రవేసి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ సదస్సుల్లో అనర్గళంగా మాట్లాడి శభాష్ అనిపించుకున్నారు. తెలంగాణకు మరింత గుర్తింపు దక్కేందుకు చొరవ చూపారు. ఐటీ మున్సిపల్, పరిశ్రమలు శాఖల్లో సంస్కరణలకు పెద్దపీట వేశారు. ఎన్నో పెట్టుబడులను తెలంగాణకు రప్పించారు. గూగుల్, ఫేస్ బుక్, అమేజాన్, వాల్ మార్ట్ వంటి దిగ్గజ సంస్థలను హైదరాబాద్ రప్పించారు. దేశవిదేశాల్లో ‘బ్రాండ్ హైదరాబాద్’ ను ప్రమోట్ చేశారు.


ఇక సోషల్ మీడియాలోనూ కేటీఆర్ చురుకైన పాత్ర పోషిస్తూ ఎవ్వరూ ఆపదలో ఉన్నామని ట్వీట్ చేసినా ఆదుకుంటున్నారు.  ఎంత ఖర్చు అయనా సరే భరిస్తూ వారికి చికిత్సనందిస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నారు. మంత్రిగా కేటీఆర్ ఆరేళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు సాధించారు.

 ప్రభుత్వంలోనూ కేటీఆర్ కీలకంగా ఎదిగారు.  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా  ఎన్నో విజయాలను అందుకున్నారు. సవాళ్లను స్వీకరించారు. ఒక్క పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే 16 సీట్లను గెలుచుకుంటానని చెప్పి తొమ్మిదికే పరిమితం చేశారు. ఆ ఒక్క అపజయం తప్పితే ఏడాదిలో కేటీఆర్ విజయాల శాతం 90శాతంపైనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

-నరేశ్ ఎన్నం

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version