గత ఆరేళ్లలో టీఆర్ఎస్ రాష్ట్రంలో బలమైన శక్తిగా మారింది. సరైన క్యాడర్ లేని దగ్గర నుంచి ప్రతిపక్షాలన్నీ జట్టుకట్టి టీఆర్ఎస్ పై పోటీకి దిగినా ఒంటరిగానే సమాధానం చెప్పే స్థాయికి ఆపార్టీ చేరుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్, కార్పొరేషన్, మున్సిపల్, సర్పంచ్ ఇలా ఏ ఎన్నిక తీసుకున్న గులాబీ పార్టీ హవానే. ఎక్కడో ఒకచోట కాంగ్రెస్, బీజేపీలు ఒకటి అర సీట్లు గెలిచి పోటీలో మేముకూడా ఉన్నామని సంకేతాలిచ్చేవి. ప్రతిపక్షాల్లో బలమైన గొంతువిన్పించే నాయకులంతా పదవుల కోసం టీఆర్ఎస్ లో చేరడంతో తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి ఎదురులేకుండా పోతుంది.
అయితే పరిస్థితులన్నీ ఎప్పుడు ఒకలా ఉండవు. ఎంతటి బలమైన నాయకుడికైనా ఏదోఒకసారి ప్రతికూల పరిస్థితులు తప్పవు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా ఎంట్రీ తర్వాత టీఆర్ఎస్ పరిస్థితి కూడా అలానే మారేలా కన్పిస్తుంది. ఈ సమయంలో సీఎం కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కొనే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే రేవంత్ రెడ్డి పేరు మాత్రమే విన్పిస్తోంది. ఆయన టీడీపీలో ఉన్నా, కాంగ్రెసులో ఉన్నా కేసీఆర్ పై పోరాటం చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ మాటలతూటలకు ధీటుగా విమర్శలు చేస్తూ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
గతంలో ప్రగతిభవన్ గడిని టచ్ చేస్తానని ఛాలెంజ్ చేసి రేవంత్ రెడ్డి చూపించారు. పోలీసుల కళ్లుగప్పి ప్రగతిభవన్లోకి ఎంట్రీ చూపించడంతో కేసీఆర్ కు ఇతడే సరైన ప్రత్యర్థి అనే భావన ప్రజల్లోకి వెళ్లింది. అలాగే టీఆర్ఎస్ సర్కార్ కరోనా కట్టడిలో విఫలమైందని రేవంత్ రెడ్డి గళంఎత్తుతున్నారు. టీమ్స్ ఆస్పత్రికి ఆకస్మికంగా సందర్శించడం, తన ఎంపీ నిధులు నుంచి ఆస్పత్రి కోసం 50లక్షలు కేటాయించడం, సచివాలయాన్ని కోవిడ్ ఆస్పత్రిగా మార్చాలని డిమాండ్ చేయడం, కేటీఆర్ ఫౌంహౌజ్ పై పోరాటాలతో తన గళాన్ని గట్టిగానే విన్పించారు. మరోవైపు కాంగ్రెస్ లో జనాకర్షణ నేతలు ఎవరు లేకపోవడంతో రేవంత్ రెడ్డికి కలిసొచ్చింది.
టీడీపీ నుంచి కాంగ్రెస్ లో సత్తాచాటుతున్న రేవంత్ రెడ్డికి ఆపార్టీలోని సీనియర్లు మొకాలు అడ్డుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి పీసీసీ పదవీ కట్టబెట్టాలని ప్రయత్నిస్తుంటే సీనియర్లంతా ఒక్కటై రేవంత్ రెడ్డికి పదవీ రాకుండా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఎలా ఉన్నా.. ప్రస్తుతం టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ ఏమేరకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందనే ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెసులోని గ్రూపు రాజకీయాలే ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారుతోన్నాయి. అయితే కాంగ్రెస్ నేతలంతా ఒక్కతాటిపై వచ్చి పోరాడితే టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం పెద్ద సమస్య కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరీ మున్ముందు ఏం జరుగుతుందో..!