నిన్నటిదాకా తెలంగాణలో కరోనా కేసులు.. చావుల లెక్కలపై పెద్దఎత్తున చర్చ జరిగేది. కరోనాతో ఎంతమంది బాధపడుతున్నారు? ఎంత మంది డిశ్చార్జ్ అవుతున్నారు? మందులు.. ఆక్సిజన్ కొరత.. వ్యాక్సినేషన్ పంపిణీ.. కరోనా జాగ్రత్తలపైనే అందరి దృష్టి ఉండేది. ఇక నాగార్జున్ ఉప ఎన్నిక రిజల్ట్ రావడంతో ఆ ముచ్చట కూడా తీరిపోయింది. ఇప్పుడంతా రాష్ట్రంలో ఒకటే చర్చ.. ఈటల రాజేందర్ ను ఉన్నఫలంగా సీఎం కేసీఆర్ క్యాబినేషన్ నుంచి బర్తరఫ్ చేయడం. అయితే దీనికి వ్యూహాం మాత్రం ‘ఐసోలేషన్లో’ జరిగినట్లుగా తెలుస్తోంది.
ముఖ్యమంత్రికి ఉన్న అధికారాల దృష్ట్యా మంత్రులను బర్తరఫ్ చేయడం.. కొత్త వారిని తీసుకోవడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఉప ముఖ్యమంత్రి రాజయ్య విషయంలోనూ ఇలాంటిదే జరిగింది. రాజయ్యను ఎందుకు బర్తరఫ్ చేశారన్న విషయం కూడా రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ తెలియకపోవడం కొసమెరుపు.
ఈటల రాజేందర్ విషయంలో మాత్రం భూ ఆక్రమాల ఆరోపణ నేపథ్యంలో ఆయనను బర్తరఫ్ చేశారు. అయితే కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా.. కుడిభుజంగా ఉన్న పేరుతెచ్చుకున్న రాజేందర్ విషయంలో సీఎం ఇలా వ్యవహారించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇదంతా ముందస్తు ప్రణాళికలో భాగంగా జరిగిందని.. కావాలనే కొందరు తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఈటల రాజేందర్ తనపై వస్తున్న ఆరోపణలపై ఘాటుగానే స్పందించారు.
తనపై కుట్ర జరుగుతుందని ముందస్తుగా తెలుసుకున్న ఈటల రాజేందర్ మంత్రి కేటీఆర్ కు గత మూడ్రోజులుగా ఫోన్లో సంప్రదింపులకు యత్నించారు. అయితే ఆయన మాత్రం ఈటల రాజేందర్ కు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. ఇటీవలే సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్.. ఎంపీ సంతోష్ కుమార్ కు కరోనా పాజిటివ్ రావడంతో వారంతా హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.
గతంలోనే ఈటల రాజేందర్ ను క్యాబినేట్ నుంచి తప్పిస్తారనే వార్తలు విన్పించాయి. ఇదే సమయంలో కరోనా కేసులు పెరిగిపోవడం.. ఆయనకు కేటీఆర్.. హరీష్ రావులు అండగా ఉండటంతో ఈ నిర్ణయం వాయిదా పడినట్లు తెలుస్తోంది. తాజాగా కేటీఆర్ సైతం హోం ఐసోలేషన్లో ఉండటంతో ఈ సమయాన్ని ఈటల వ్యతిరేకవర్గం అనుకూలంగా మార్చుకున్నట్లు కన్పిస్తోంది.
ఇదే సమయంలో కేటీఆర్ చేతికి మట్టి అంటకుండా వ్యూహాత్మకంగా రాజేందర్ ను పదవీని తప్పించినట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ బర్తరఫ్ వెనుక కేవలం భూ ఆరోపణలు ప్రధాన కారణంగా కాదని.. దానిని బూచిగా చూపి కావాలనే ఆయనను బయటికి పంపించారనే విమర్శలు రాజేందర్ అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. కేటీఆర్ ఐసోలేషన్లో ఉండటం ఓ విధంగా ఆయనకు కలిసిరాగా? ఈటలకు మాత్రం పరాభవంగా మారడం శోచనీయంగా మారింది.