ఎట్టకేలకు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగింది. 42 మంత్రులతో సహా 78 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం వహించారు. కానీ ఆంధ్రప్రదేశ్ ను మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఏపీ వాసుల్లో ఆగ్రహం వస్తుందనేది నిర్వివాదాంశం. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెరుగుతున్నాయి. ఏపీ అంటే లెక్క లేదా అనే విషయాలు వెలుగుచూస్తున్నాయి. జాతీయ రాజకీయాలు ఎలా ఉన్నా రాష్ర్టంలో మాత్రం మంత్రి పదవి రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ప్రధాని మోడీ మంత్రి వర్గ విస్తరణపై విమర్శలు చెలరేగిన ఆయన మాట్లాడిన మాటలను గుర్తించాలని పార్టీ నాయకులు చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం ప్రధాని మాట్లాడుతూ మంత్రుల పనితీరు బాగా లేకపోతే మూడేళ్లలో మరోసారి విస్తరణ ఉండవచ్చనే సంకేతాలు ఇచ్చారు. దీంతో బీజేపీ నాయకులు మరో విస్తరణలో ఏపీకి సముచిత స్థానం ఉంటుందని భావిస్తున్నారు. మార్పులు చేర్పులకు అవకాశం ఉండడంతో ఏపీ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు మంత్రి పదవి ఇచ్చే విషయంలో ఓ మెలిక పెడుతున్నారు. వైసీపీ, జనసేన పార్టీల్లో ఇప్పటికి కూడా ఏ క్లారిటీ లేకుండా ఉన్నాయని వాదన. బీజేపీతో నడిచేందుకు ఎవరు సంసిద్ధులైతే వారికే మంత్రి పదవి ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీతో కలిసేందుకు ఇద్దరు నేతలు కూడా ఎప్పుడు తమ నిర్ణయాన్ని వెల్లడించలేదు. దీంతో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనే సంశయంతోనే పక్కకు పెట్టినట్లు సమాచారం. అయితే ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్ వైఖరిలో మార్పు వస్తుందని భావించినా పూర్తిగా తమ వైపుకు మళ్లినాకే చూస్తామని చెబుతున్నారు.
జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసే విషయంలో పవన్ కళ్యాణ్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ లోగా విస్తరణ పూర్తయింది. పవన్ సరేనంటే మరో విడతలోనైనా సముచిత స్థానం కల్పించవచ్చని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ బీజేపీలో చేరితే సమీకరణలు మారవచ్చని బీజేపీ భావన. పవన్ కళ్యాణ్ కూడా తమ వైఖరి వెల్లడించి బీజేపీతో సహకరిస్తే ఆయనకు కూడా మేలు జరగనున్నట్లు చెబుతున్నారు.