Haryana Results 2024: ఎగ్జిట్‌పోల్‌ అంచనాలు తలకిందులు.. హర్యానాలో హ్యాట్రిక్‌ కొట్టిన బీజేపీ!

ఇటీవల దేశంలో హర్యానా, జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. హర్యానాకు ఒకే విడతలో, జమ్మూ కశ్మీర్‌కు మూడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించారు. అక్టోబర్‌ 5న పోలింగ్‌ ముగియగా, అదే రోజు సాయంత్రం ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెల్లడయ్యాయి.

Written By: Raj Shekar, Updated On : October 8, 2024 4:30 pm

Haryana Results 2024(1)

Follow us on

Haryana Results 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఐపీఎల్‌ మ్యాచ్‌ను తలపిస్తున్నాయి. ఫలితాల్లో తొలి రౌండ్‌లో ట్రెండ్స్‌ పూర్తిగా యూటర్న్‌ తీసుకుని తీవ్ర ఉత్కంఠ రేపాయి. తొలి రౌండ్‌లో 65 స్థానాల్లో అధిక్యం కనబర్చిన కాంగ్రెస్‌ పార్టీ, రెండో రౌండ్‌లో 40 స్థానాలకు పడిపోయింది. అనూహ్యంగా తొలిరౌండ్‌లో 25 స్థానాల్లో అధిక్యక కనబర్చిన బీజేపీ 45 స్థానాల్లో ఆధిక్యం కనబర్చింది. తర్వాత అన్ని రౌండ్లలోనూ బీజేపీ ఆధిక్యం కొనసాగిస్తుంది. ట్రెండ్స్‌ అవే కొనసాగుతున్నాయి. దీంతో హ్యాట్రిక్‌ విజయం దిశగా బీజేపీ దూసుకుపోతోంది. 2019 ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లు గెలవగా జేజేపీతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి 50 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటిపోయింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ హర్యానా హస్తగతం అవుతుందని అంచనా వేశాయి. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఎవరి అంచనాలకు చిక్కకుండా హర్యానా ఓటర్లు బీజేపీకి మూడోసారి అధికారం కట్టబెట్టారు. తొలి రౌండ్‌ ఫలితాల తర్వాత స్వీట్లు పంచుకున్న కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు కామ్‌ అయ్యారు.

ఒక్కసారిగా మారిన ట్రెండ్స్‌..
మొదటి రౌండ్‌ కౌంటింగ్‌ తర్వాత కాంగ్రెస్‌ 65 స్థానాల్లో ఆధిక్యం కనబర్చింది. దీంతో క్లీన్‌స్వీప్‌ ఖాయమని అంతా భావించారు. భూపేంద్ర హుడా కాంగ్రెస్‌ విజయం ఖాయమని, ప్రజలు మార్పు కోరుకున్నారని ప్రకటించారు. కానీ, రెండో రౌండ్‌ నుంచి ఒక్కసారిగా ట్రెండ్స్‌ మారిపోయాయి. రౌండ్‌ రౌండ్‌కు బీజేపీ లీడ్‌ పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం బీజేపీ 50 స్థానాల్లో అధిక్యత కనబరుస్తుండగా, కాంగ్రెస్‌ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో బీజేపీ అధికారం దాదపు ఖాయమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్‌ కిసాన్, జవాన్, పహిల్వాన్‌ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. కానీ, అవేవీ పనిచేయలేదు. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ తలకిందులయ్యాయి.

వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా..
హర్యానాలో వారసత్వ రాజకీయాలు ఎక్కువ. కాంగ్రెస్‌లో ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలా మంది సీనియన్‌ నాయకులు వారసులే ఉన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి భూపేంద్ర సింగ్‌ తనకుడు ఎంపీగా ఉన్నారు. చాలా మంది వారసులు పోటీలో నిలిచారు. వారసత్వ రాజకీయాలతో అభివృద్ధి సాధ్యం కాదని భావించిన హర్యానా ఓటర్లు కాంగ్రెస్‌ ఎత్తుకున్న కిసాన్, జవాన్, పహిల్వాన్‌ నినాదాన్నిపక్కన పెట్టారు. బీజేపీకే మరోమారు పట్టం కట్టారు. జాట్‌లలో పట్టు నిలుపుకోవడం బీజేపీకి కలిసి వచ్చింది.