https://oktelugu.com/

RSS Bharat: ఇండియా నుంచి భారత్ కు: అప్పట్లో సంఘ్ ఏం చెప్పింది?

ఇండియా పేరును భారత్ గా మార్చాలని గతంలో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. అలా దాఖలైన పిల్ పై 2016 మార్చిలో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్, లలిత్ తో కూడిన ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Written By:
  • Rocky
  • , Updated On : September 7, 2023 / 09:37 AM IST

    RSS Bharat

    Follow us on

    RSS Bharat: ఇండియా పేరును భారత్ గా మార్చాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎప్పటి నుంచో పట్టుపడుతోందా?
    సంఘ్ సర్ సంచాలక్ మోహన్ భగవత్ ఇదే సూచన చేశారా? దానిని ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారా? అంటే దీనికి అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇండియా పేరును భారత్ గా మారుస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని పార్లమెంటు వర్షాకాల సమావేశంలో బిజెపి రాజ్యసభ సభ్యుడు నరేష్ బన్సల్, హర్ నాథ్ సింగ్ యాదవ్ డిమాండ్ చేయడం విశేషం. ఇవన్నీ పక్కన పెడితే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలో 28 కి పైగా రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి రావడం, సీట్ల సర్దుబాటు పై నిర్ణయం తీసుకోవడం.. కమల నాధులను కలవరపాటుకు గురి చేస్తున్నట్టు తెలుస్తోంది. విపక్షాల ప్రయత్నాలు, ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇండియా పేరును భారత్ గా మార్చాలని అంశాన్ని తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది.

    అప్పట్లో సుప్రీంకోర్టు ఏమన్నదంటే

    ఇండియా పేరును భారత్ గా మార్చాలని గతంలో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. అలా దాఖలైన పిల్ పై 2016 మార్చిలో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్, లలిత్ తో కూడిన ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కొందరు భారత్ అని పిలుస్తారు, మరికొందరు ఇండియా అని పిలుస్తారు. ఇందులో అభ్యంతరం ఏముందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది జరిగిన నాలుగు సంవత్సరాల క్రితం అంటే 2020 లో కూడా ఇటువంటి పిల్ దాఖలైంది. అయితే ఈ కేసును తీసుకునేందుకు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఆ పిల్ ను వినతి రూపంలోకి మార్చి.. సముచితమైన నిర్ణయం తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఫిర్యాదుదారులకు సూచించింది. రాజ్యాంగంలోని ఒకటవ ఆర్టికల్ లో ఇండియా దటీజ్ భారత్ అని పేర్కొన్నారు. రాజ్యాంగ సభ ఏర్పడక ముందు దేశాన్ని భారత్, ఇండియా, హిందూస్తాన్ అని పిలిచేవారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని ఏమని పిలవాలి అనే దానిపై రాజ్యాంగ సభలో విస్తృతంగా చర్చలు జరిగాయి. భారత ఉపఖండాన్ని ఇండియా అని పిలుద్దామా, భారత్ అని పిలుద్దామా రాజ్యాంగ ముసాయిదా రచనా సంఘం చర్చించింది. భారత్ వైపు కొంత మంది మొగ్గు చూపగా.. ఎక్కువమంది ఇండియాకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో ఇండియా, దటీజ్ భారత్, రాష్ట్రాల సంఘం అని ఒకటవ అధికరణను రాజ్యాంగ సభ 1949 సెప్టెంబర్ 1న ఆమోదించింది. ఈ అధికరణ భారత సమైక్యతను నొక్కి చెప్పింది. అలాగే భారతీయ ఏకీ కృత రాజ్యం కాదని.. రాష్ట్రాల సంఘంగా పేర్కొంది. దేశం నుంచి విడిపోయే హక్కు రాష్ట్రాలకు లేదని స్పష్టత ఇచ్చేందుకే రాష్ట్రాల సంఘం గా పేర్కొన్నామని అంబేద్కర్ ఈ ఆర్టికల్ పై వివరణ కూడా ఇచ్చారు. కాగా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా పేరును భారత్ గా మార్చాలంటే ఎన్నో రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఐక్య రాజ్య సమితిలో మన దేశం పేరు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా గా ఉంది. దానిని రిపబ్లిక్ ఆఫ్ భారత్ గా మార్చాల్సి ఉంటుంది. అన్ని దేశాలకు సంబంధిత సమాచారం పంపాల్సి ఉంటుంది.

    డాట్. ఇన్ పరిస్థితి ఏంటి?

    ఇక ఇండియా పేరును భారత్ గా మారిస్తే డాట్. ఇన్ పేరిట ఉన్న వెబ్సైట్లో పరిస్థితి ఏమిటి అనే అంశం కూడా తెరపైకి వస్తోంది. వెబ్ సైట్ అడ్రస్ ల విషయానికి వస్తే కంట్రీ కోడ్ టాప్ లేయర్ డొమైన్ ప్రకారం ఇండియాలోని వెబ్ సైట్లను డాట్ ఇన్ రిజిస్ట్రీతో గుర్తిస్తారు. వీటిని ఎన్ ఐ ఎక్స్ ఐ అనే సంస్థ రూపొందిస్తుంది. దీనికి తోడు డాట్ ఇన్ ను ప్రతిష్ట ప్రయోజనం కోసం కొన్ని వెబ్సైట్లకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఉదాహరణకు జీవో వీ. ఇన్ అనేది భారత ప్రభుత్వం ఉపయోగిస్తుండగా.. ఎం ఐ ఎల్..ఇన్ ను మిల్ట్రీ వినియోగిస్తుంది. టి ఎల్ డి లకు అన్నిదేశాల వెబ్ సైట్ లకు ఒక గుర్తింపు ఇస్తాయి.. డాట్ ఇన్ అంటే అది ఇండియన్ వెబ్సైట్ అని సులువుగా గుర్తించవచ్చు.. భవిష్యత్తులో ఇండియాను ప్రపంచమంతా భారత్ అని పిలవాల్సి వస్తే.. మన దేశ వెబ్ సైట్లకు కూడా ఒక కొత్త టి.ఎల్.డి ఉండటం మంచిదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అదే జరిగితే డాట్ బిహెచ్ లేదా డాట్ బిఆర్, డాట్ బీటీ లను పరిశీలించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే బ్రెజిల్ డాట్ బిఆర్, బహ్రెయిన్ డాట్ బీహెచ్, భూటాన్ డాట్ బీటీ లను వాడుతున్నాయి. అయితే ఇండియా పేరు భారత్ గా మారినంత మాత్రాన ప్రస్తుతం వాడుతున్న డాట్ ఇన్ డొమైన్ ఉన్న వెబ్ సైట్లకు ఎటువంటి ఆపరేషన్ సమస్య ఉండదనే విషయాన్ని సాంకేతిక నిపుణులు గుర్తు చేస్తున్నారు.