Modi- Pawan Kalyan: ఏపీ సీఎం జగన్ విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తన మనసుకు నచ్చినట్టు చేయలేక..అటు మోదీ నేతృత్వంలోని బీజేపీ పెద్దల వ్యవహార శైలి నచ్చక తనలోనే తాను సతమతమవుతున్నారు. బొమ్మరిల్లులో కథానాయకుడి క్యారెక్టర్ మాదిరిగా తయారైంది జగన్ పరిస్థితి. కక్కలేక మింగలేక తప్పనిసరి పరిస్థితులతో కేంద్ర పెద్దలతో సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తో ప్రధాని మోదీ బేటీ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లూ పవన్ పై వైసీపీ నేతలు చిన్నచూపు చూశారు. పేరుకే జనసేన, బీజేపీ మిత్రపక్షాలు కానీ.. వారికి కలిసింది లేదు. కలిసి నడిచింది లేదంటూ వైసీపీ నేతలు లైట్ తీసుకున్నారు. మరీ ముఖ్యంగా పవన్ కు అంత సీన్ లేదంటూ ఎగతాళి చేశారు. అంతటి ఆగకుండా ఆయన్ను కెలికారు. ఈ పర్యవసానాలన్నీ దాని ఫలితమే.

గత ఎన్నికల్లో వైసీపీ ట్రాప్ లో పడి టీడీపీ బీజేపీ స్నేహాన్ని వదులుకుంది. దశాబ్దాల బంధాన్ని తెగతెంపులు చేసుకుంది. అయితే అక్కడే తెలివితేటలను ప్రదర్శించిన జగన్ టీడీపీతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసుకొని కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూ వచ్చారు. అటు కేంద్రానికి రాజ్యసభలో మెజార్టీ లేకపోవడం, కీలక బిల్లుల ఆమోదానికి, ఇతరత్రా అవసరాలకు జగన్ అవసరం పడింది. పైగా రాష్ట్రానికి అవి కావాలి? ఇవి కావాలి? అంటూ జగన్ వారికి ఇబ్బందులు పెట్టలేదు. అటు కేసుల దృష్ట్యా తగ్గుతూ..అతి వినయం ప్రదర్శిస్తూ వచ్చిన సీఎం జగన్ కు కేంద్ర పెద్దల సహకారం తోడైంది. అయితే ఎప్పుడూ రాజకీయ పరిస్థితులు ఒకేలా ఉండవు కనుక… జగన్ సర్కారుపై తీవ్ర ప్రజా వ్యతిరేకతను గుర్తించిన కేంద్రం ఇప్పుడు తరుణోపాయం సిద్ధం చేసింది. అటు వచ్చే సాధారణ ఎన్నికలు ఏమంతా ఆశాజనకంగా ఉండవని భావించి సొంతంగా ఎదగాలని బీజేపీ నిర్ణయించుకుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మిత్రపక్షాలను వదులుకోకూడదన్ననిర్ణయానికి వచ్చారు. అందులో భాగమే ప్రధాని పవన్ కళ్యాణ్ తో భేటీ.
విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని వైసీపీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని కూడా బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పక్కన ఉన్న కర్ణాటక,తెలంగాణలో పార్టీ బలపడుతున్నా ఇక్కడ ఎందుకు ఆ పరిస్థితి లేదని ప్రశ్నించినట్టు సమాచారం. అయితే ఇప్పటికే ప్రధానికి రాష్ట్ర పార్టీ నివేదికలు అందాయి. ఏదో పార్టీపై ఆధారపడే కంటే సొంతంగా ఎదిగే ప్రయత్నం చేయడం లేకపోవడం మైనస్ గా మారిందని నివేదికల సారాంశం. ఈ క్రమంలో ఏపీ బీజేపీ నేతలకు ప్రధాని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఒక దేశ ప్రధానిగా.. విశాఖ దృక్పథంలో భాగంగానే ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తున్నాము తప్ప .. రాజకీయం కానేకాదని ప్రధాని కుండబద్దలు కొట్టినట్టు సమాచారం.

అయితే పవన్ తో తాజా భేటీ మాత్రం వైసీపీ నేతలకు మింగుడుపడడం లేదు. ఏదో జరిగిందన్న అనుమానం వారిని వెంటాడుతోంది. ఇప్పటికే పవన్ బీజేపీ పెద్దలకు రూట్ మ్యాప్ అడిగినా ఇవ్వలేదని ఆక్షేపిస్తూవచ్చారు. ఇప్పుడు ప్రధానే నేరుగా పిలిచి మాట్లాడినప్పుడు దీనిపై తప్పకుండా స్పష్టత వచ్చే అవకాశముంది. పైగా ఈ భేటీతో తప్పకుండా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందని పవన్ ప్రకటించారు. అయితే వైసీపీ విముక్త ఏపీతోనే రాష్ట్ర ప్రయోజనం సాధ్యమని పవన్ చెబుతుంటారు. అంటే ఈ లెక్కన వైసీపీ సర్కారు గట్టి గుణపాఠం చెప్పేలా ప్రధాని ఏదో ఒక మాట పవన్ చెవిన వేసి ఉంటారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఇప్పటివరకూ ప్రతీనెలా ఠంచనుగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలిసేవారు. రాష్ట్రప్రయోజనాలను పక్కనపెడితే తనకు కేంద్ర పెద్దలతో చనువు ఉందని.. వారి అండదండలు తనకే ఉన్నాయని జగన్ ప్రజలకు ఒక మెసేజ్ పంపేవారు. ఇప్పుడు తాజాగా పవన్ ను ఏరికోరి ఆహ్వానించి ప్రధాని భేటీ కావడంతో జగన్ నానా హైరానా పడుతున్నారు.