
Scared KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావులో భయం మొదలైందా.. అవుననే అంటున్నాయి బీఆర్‌ఎస్ వర్గాలు. అయితే అసలు ఆయన ఎందుకు భయపెడుతున్నారు.. అంతలా భయపెడుతున్న అంశం ఏమిటి అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి.. అధికారం చేతిలో పెట్టుకుని కేసీఆర్ ఎందుకు అంతలా భయపడుతున్నారో అంతు చిక్కడం లేదు.
జాతీయ రాజకీయాలేనా..
కేసీఆర్‌ను జాతీయ రాజకీయాలే బాగా భయపెడుతున్నట్లు ప్రచారం జరుగోతంది. దేశ రాజకీయాల్లో చంక్రం తిప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితిని, భారత రాష్ట్ర సమితిగా మార్చాడు కేసీఆర్. అయితే పార్టీ పేరు మార్చి ఆరు నెలలైనా ఆశించిన స్థాయిలో ఎదుగుదల కనిపించడం లేదు. మరోవైపు పెద్దగా చేరికలు ఉండడంలేదు. ఇంకోవైపు విపక్షాలేవి కేసీఆర్‌తో కలిసి పనిచేయడానికి ముందుకు రావడం లేదు. కనీసం పొత్తు పెట్టుకునేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. దీంతో తెలంగాణలో ఉన్న 17 సీట్లతో వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పలమన్న ఆందోళన కేసీఆర్‌లో మొదలైనట్లు తెలుస్తోంది. ఉన్న 17 లోక్‌సభ స్థానాల్లో కూడా ఎన్ని గెలుస్తారో తెలియని పరిస్థితి. ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ దాటకపోవచ్చన్న చర్చ జరుగుతోంది.
ఇక వెంటాడుతున్న కేసులు..
ఒకవైపు జాతీయ రాజకీయాలు అచ్చిరాకపోగా, మరోవైపు కేసులు, స్కాంలు, అవినీతి మరక కేసీఆర్ కుటుంబాన్ని పార్టీని వెంటాడుతున్నాయి. ఈ మరకలే విపక్షాలు కేసీఆర్‌ను నమ్మకపోవడానికి కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే లిక్కస్కాం కేసులో కేసీఆర్ కూతురు కవిత ఇరుక్కుపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కేసీఆర్ కొడుకే కేటీఆర్‌ను చుట్టుకుంటోంది. బీజేపీ టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారాన్ని, ఆయన పాత్రను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్‌ను అంధకారం చేశాడని ఆరోపిస్తోంది. మరోవైపు లిక్కర్ స్కాం అంశం కేసీఆర్ వరకూ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో కేసీఆర్ పాత్రపైనా విచారణ జరుపొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ఈడీ కూడా ఎంటర్ అయింది.
ప్రతీ విషయం లీక్..
ఇక కేసీఆర్ రాజకీయ వ్యూహాల్లో అపర చాణక్యుడు. ఎత్తుకు పైఎత్తు వేయడంలో దిట్ట. కానీ ఆయన తాజాగా వేస్తున్న ప్రతీ వ్యూహం బయటకు లీక్ అవుతోంది. మొన్న విమానం కొనుగోలు నుంచి నిన్న విపక్షాల ఎన్నికల ఖర్చు భరించే అంశం వరకూ అన్నీ బయటకు వచ్చాయి. మరోవైపు ఈ లీకులను బీఆర్‌ఎస్ ఖండించడం లేదు. దీంతో వాస్తవం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో, విపక్షాల్లో వ్యక్తమవుతోంది. గతంలో ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలుసుకునే కేసీఆర్‌కు ఇప్పుడు తన విషయాలే లీకేజీ కావడం తలనొప్పిగా మారాయి. మొత్తంగా అనేక అంశాలు కేసీఆర్‌ను టెన్షన్ పెడుతున్నాయి. అయితే క్యాడర్‌లో ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా ఉండేందుకు కేసీఆర్ పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.