
తెలంగాణలో షర్మిల పార్టీ పెడుతుందన్న వార్తలు మొదట్లో అందరికీ ఆసక్తివనిపించాయి. కానీ రాను రాను ఎవరూ పట్టించుకోనట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె ఈనెల 9న పార్టీ పెడుతారని అందరూ భావించారు. అనుకోని కారణాలవల్ల సాధ్యం కాలేదు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వైఎస్ జయంతి సందర్భంగా ఆ తేదీన ప్రకటిస్తారని కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి. అయితే ప్రజలు ఇప్పుడు కరోనా చిక్కుల్లో నుంచి బయటపడడం కోసమే యుద్ధం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర విషయాలను పట్టించుకునే ఆసక్తి లేనట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఆమె పార్టీ పెడుతున్నారని మొదట జరిగిన ప్రచారంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమేనా..? అని భావించారు. అనుకున్నదే తడవుగా ఆమె కేసీఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు సాగించారు. కేసీఆర్ ను తిడితే ఆయన వ్యతిరేకులంతా తమకు మద్దతు ఇస్తారని భావించారు. కానీ అలా జరగలేదు. అటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం షర్మిలకు సంబంధించి ఏ విషయమూ మాట్లాడడం లేదు. ఇటీవల జరిగిన నాగార్జున సాగర్లోనూ కేసీఆర్ షర్మిల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
అయితే మిగతా పార్టీల నాయకులు మాత్రం కేసీఆర్ ఆశీర్వాదంతోనే షర్మిల పార్టీని కొనసాగిస్తున్నారని అంటున్నారు. అయితే షర్మిలను పట్టించుకోకపోవడం వల్లే ఆమె ప్రస్తావన తీయలేదని కొందరు టీఆర్ఎస్ నాయకులు అనుకుంటున్నారు. కానీ షర్మిల మాత్రం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు దండిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందని వారి తరుపు ఇందిరా పార్కు వద్ద దీక్షకు దిగారు. ఆ తరువాత లోటస్ పౌండ్ కు మార్చారు.
ఈ దీక్షకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోదండరాం, గద్దర్ లాంటి పెద్దలకు లేఖ రాశారు. తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. కానీ వారు పట్టించుకోలేదు. దీంతో ఆమె ఒంటరిగానే దీక్షను కొనసాగించారు. అయితే షర్మిల పార్టీ పెట్టకముందే తనకు మద్దతు విషయం ఎలా ఉంటుందని గ్రహించారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల పార్టీ పెడుతారా..? లేదా..? అనేది హాట్ టాపిక్ గా మారింది.