మాజీ మంత్రి ఈటల రాజేందర్ తల్లిలాంటి పార్టీ గుండెల మీద తన్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. మంత్రిగా నియోజకవర్గానికి ఏం చేయలేకపోయిన ఈటల ఇప్పుడు ఎమ్మెల్యే అయి ఏం చేస్తాడని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్ రావు పాల్గొని ప్రసంగించారు. ఈటలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హుజురాబాద్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమేని చెప్పారు. ఈటల గెలిస్తే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉంటారని గుర్తు చేశారు. ఏడేళ్లు మంత్రిగా ఉన్న ఈటల నియోజకవర్గానికి ఏం చేశారని అన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల ఒక్క డబుల్ బెడ్ రూం కూడా కట్టివ్వలేదని పేర్కొన్నారు. ఈటలను సీఎం కేసీఆర్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసినా గురుతర బాధ్యత మరిచారని గుర్తు చేశారు. రైతుబంధు, దళిత బంధు, ఆసరా పింఛన్లపై ఈటల విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈటల విమర్శలు చేయడం సబబు కాదని హితవు పలికారు. ఈటల రాజేందర్ ఓటమి భయంతోనే సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
నియోజకవర్గానికి కేసీఆర్ నాలుగు వేల ఇళ్లు మంజూరు చేసినా ఈటల ఒక్క ఇల్లు కూడా కట్టివ్వలేదని ఆరోపించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించే బాధ్యత తమదేనని పేర్కొన్నారు. హుజురాబాద్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపిస్తే ఊరికో మహిళా సంఘం భవనం నిర్మిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్తి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించాలని కార్యకర్తలకు సూచించారు. అభివృద్ధికే ఓటు వేయాలని కోరారు.
బీజేపీకి ఓటు వేస్తే అభివృద్ధి కనిపించదని గుర్తు చేశారు.బీజేపీని గెలిపిస్తే పెట్రోల్ ధర ఇంకా పెరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం తన ఉనికి కోల్పోయిందని అన్నారు. హుజురాబాద్ లో పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ఉంటుందని వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అంతకుముందు హుజురాబాద్ లో హరీశ్ రావు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి జమ్మికుంట మీదుగా ర్యాలీగా ఇల్లందకుంటకు చేరుకున్నారు.