
ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కష్టపడుతుంటే.. ప్రతిపక్షాలు ఐసోలేషన్ లో ఉన్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. రైతుల పక్షాన కేసీఆర్ సర్కార్ పనిచేస్తుంటే ప్రతిపక్షాలు ఏసీ రూమ్స్ లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం రైతుల నుంచి పంట కొనుగోలు చేయడంలేదని.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో తాము రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మద్దతు ధర చెల్లించి చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని హరీష్ రావు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులు పంటను అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు గుప్పించారు.
మెదక్ లో మీడియాతో మాట్లాడుతూ..”మేం రైతుల మధ్య, ప్రజల మధ్య తిరుగుతున్నాం. ప్రతిపక్షాలు హైదరాబాద్ లో, గాంధీ భవన్ లోకూర్చున్నారు. హైదరాబాద్ లో ఎసీ రూంలలో కూర్చుని ప్రతిపక్ష నేతలు రైతుల మీద మొసలి కన్నీరు కారుస్తున్నారు. కరోనా వచ్చిన కష్ట కాలంలో రైతులకు ఇబ్బంది లేకుండా పంటలు కొంటున్నాం. కరోనా ఇబ్బంది పరిస్థితుల్లో ఎమ్మెల్యే, అధికారులు, ఐకేపీ సిబ్బంది కష్టపడి పని చేస్తున్నారు. కరోనా వల్ల దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రం రైతుల నుంచి పంటలు కొనడం లేదు. కర్ణాటకలో ప్రభుత్వం శనగలు కొనుగోలు చేయడం లేదు. బీదర్ రైతులు నారాయణ ఖేడ్, జహీరాబాద్ కు తెచ్చి అమ్మందుకు ప్రయత్నిస్తున్నారు. రైతు శ్రేయోభిలాషి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు విమర్శలు, అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. రాష్ట్ర మంతా లాక్ డౌన్ ఉన్నా…రైతులకు లాక్ డౌన్ లేదు.” అని హరీష్ రావు పేర్కొన్నారు.