Telangana, Harish Rao: హుజురాబాద్ లో రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టే బాధ్యతలు మంత్రి హరీశ్ రావుకు(Harish Rao) అప్పగించారు. అధినేత కేసీఆర్ కనుసన్నల్లో పార్టీని నడిపించాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న రాజేందర్ నిర్వహించిన బాధ్యతల్ని ఇప్పుడు హరీశ్ రావుకు అప్పగిస్తున్నారు. ఉప ఎన్నిక కోసం ఇన్ చార్జిగా నియమించారు. తాజాగా ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా(Exhibition Society president) హరీశ్ రావును నియమించడంతో కమిటీ సభ్యులు ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఎగ్జిబిషన్ సొసైటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని హరీశ్ రావు వారికి హామీ ఇచ్చారు. నాంపల్లిలో ప్రతి ఏటా నిర్వహించే నుమాయిష్ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తుంది. కాంగ్రెస్ హయాంలో జానారెడ్డి అధ్యక్షుడిగా ఉండేవారు. తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈటల రాజేందర్ అధ్యక్షుడిగా కొనసాగేవారు. ఈటల బయటకు వెళ్లడంతో ఆయన స్థానంలో హరీశ్ రావుకు ప్రాతినిధ్యం కల్పించారు. ఈటల అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్రమాలు చోటుచేసుకున్నాయని ఏసీబీ అధికారులు సోదాలు చేసినా తరువాత ఎవరు పట్టించుకోలేదు. దీంతో ఆ విషయం కాస్త మరుగునపడిపోయింది.
ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్ కమిటీ అధ్యక్షుడిగా హరీశ్ రావును ఎన్నుకుని సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సొసైటీకి పెద్ద ఎత్తున ఆస్తులున్నాయి. విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. సొసైటీ సభ్యులు ఎక్కువగా రాజకీయ గొడవలు లేకుండా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వారిని తమ అధ్యక్షుడిగా ఎన్నుకుని విధులు నిర్వహించుకోవడం వారి విధి.
ఈ క్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీకి హరీశ్ రావు పెద్ద దిక్కుగా ఉండి సంస్థ మనుగడకు పాటు పడనున్నారు. సంస్థను అభివృద్ధి చేయడంలో తనదైన ముద్ర వేసే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే సొసైటీ సభ్యులు హరీశ్ రావుకే మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభుత్వంలో మంచి స్థానంలో ఉన్న వారిని తమ సంస్థకు ప్రతినిధిగా ఎన్నుకోవడం సొసైటీకీ పరిపాటే.