Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధికార బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ లక్ష్యంగా దూసుకుపోతోంది. అందరకంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. బీఫాంలు కూడా ఇచ్చింది. మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ప్రచారంలో భాగంగా ముఖ్యమైన మంత్రి కేటీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే 40 నియోజకవర్గాలను చేట్టేశారు. ఇక కేసీఆర్ కూడా కదనరంగంలోకి దిగి 40 నియోజకవర్గాల్లో ప్రచార సభలకు ప్లాన్ వేసుకున్నారు. ఇలా అధికార బీఆర్‌ఎస్ విపక్షాలకు అందకుండా దూసుకుపోతోంది. విపక్ష కాంగ్రెస్, బీజేపీలు మాత్రం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాటడం లేదు. అభ్యర్థుల కోసమే కుస్తీలు పడుతున్నాయి. ఈ క్రమంలో హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అంటూ బీఆర్‌ఎస్ ప్రచారం మొదలు పెట్టింది. సారు.. కారు.. బీఆర్‌ఎస్ సర్కారు అంటూ నినదిస్తోంది.
కాంగ్రెస్ సమరశంఖం..
మరోవైపు కాంగ్రెస్ కూడా తొలి జాబితా ప్రకటించి ఎన్నికల సమరశంఖం పూరించింది. ములుగు నుంచి రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ప్రచారం మొదలు పెట్టారు. మూడు రోజుల బస్సుయాత్ర చేస్తున్నారు. మరోవైపు రెండో జాబితాకు కూడా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. దసరా తర్వాత లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది.
అభ్యర్థుల ఎంపికలోనే బీజేపీ..
ఇక బీఆర్‌ఎస్‌తో ఆరు నెలల క్రితం వరకు ఢీ అంటే ఢీ అన్న బీజేపీ మాత్రం అభ్యర్థుల ఎంపికకే కుస్తీలు పడుతోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినా అభ్యర్థులను ప్రకటించడం లేదు. మరోవైపు ప్రచారానికి జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు వస్తున్నా ప్రచారం మాత్రం కల్పించడం లేదు. షెడ్యూల్ వచ్చిన తర్వాత హోం మంత్రి అమిత్‌షా ఆదిలాబాద్‌కు వచ్చారు. ఆ సభపై పెద్దగా ప్రచారం చేయలేదు. తర్వాత రాజ్‌నాథ్‌సింగ్, పీయూష్‌గోయల్ వచ్చారు. కానీ చాలా మందికి తెలియదు.
హంగ్ వచ్చేలా ప్లాన్..
తెలంగాణలో ఎవరికీ మెజారిటీ సీట్లు రావని, సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి ప్రకటించారు. అధికారం మాత్రం బీజేపీ చేపడుతుందని తెలిపారు. దీంతో బీజేపీ తెలంగాణలో హంగ్ రావాలని చూస్తుందని అర్థమైంది. ఇప్పుడు ఆ పార్టీ వేస్తున్న అడుగులు కూడా ఆ దిశగానే సాగుతున్నాయి.
రేసు నుంచి తప్పుకున్న కమలం..
తెలంగాణలో బీజేపీ గెలుపు అవకాశాల్ని ఎప్పుడో వదిలేసుకుంది. ఓ దశలో రేసులోకి వచ్చిన పార్టీ హైకమాండ్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో పూర్తిగా వెనుకబడిపోయింది. ఏది చేసైనా.. ఎలాగైనా 15 నుంచి 20 సీట్లు గెలిచేందుకు కమలం పార్టీ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ అంతర్గత సమావేశాల్లో నేతలు చెబుతున్నారు. కచ్చితంగా 15 నుంచి 20 సీట్లలో గెలవటానికి తీవ్రంగా శ్రమించండి. .. అలా గెలవగలిగితే బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వాన్ని ఉల్టా ఫల్టా చేయొచ్చన్న భావనలో బీజేపీ ఉంది. తద్వారా అధికార మార్పిడి చేయొచ్చునని సూచిస్తున్నారు.. బలం లేని జనరల్ నియోజకవర్గాల్లో కాకుండా కొంతలో కొంత కలిసొచ్చే ఎస్సీ, ఎస్టీ స్థానాలపై గురి పెట్టాలంటూ వారు సూచించినట్టు సమాచారం. అందుకే బీజేపీ ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద కాకుండా.. ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాలపైనే ఎక్కువ దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ విజయం కోసం శ్రమిస్తున్నాయి. రానురాను రెండు పార్టీల మధ్య ముఖాముఖి పోరు అన్నట్లుగా మారిపోతోంది. కాంగ్రెస్ కావాలా బీఆర్‌ఎస్ కావాలా అన్నట్లుగా రాజకీయం మారుతూండటంతో ఓటర్లు కూడా పోలరైజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ప్లాన్ ఎంత వరకూ వర్కవుట్‌అవుతుందో చూడాలి.