
మిజోరంలో పట్టుబడిన తలనీలాలు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివి అని.. టీటీడీ , వైసీపీ నేతలు దీన్ని అమ్మేసుకున్నారని మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై తాజాగా టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి క్లారిటీ ఇచ్చారు.
మిజోరం నుంచి మయన్మార్ దేశానికి తరలిస్తుండగా కోట్ల విలువైన తలనీలాలు అస్సాం రైఫిల్ పోలీసులు పట్టుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే టీటీడీ తలనీలాలే అని టీడీపీ నేతలు ఆరోపించారు. వీటిపై తాజాగా స్పందించిన టీటీడీ అదనపు ఈవో ఈ ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ధర్మారెడ్డి పేర్కొన్నారు.
తలనీలాల సీజ్ కు సంబంధించి కస్టమ్స్, అస్సాం రైఫిల్స్ అధికారులు స్థానిక పోలీసులకు అందించిన నివేదికలను మీడియాకు అదనపు ఈవో విడుదల చేశారు.అక్కడి అధికారులు ఇచ్చిన నివేదికలో తుక్కు తలవెంట్రుకలు టీటీడీవి కాదని అక్కడి అధికారులే స్పష్టం చేవరాని.. పైగా సీజ్ చేసిన తలనీలాలు ప్రాసెస్ చేయనివిగా అందులో పేర్కొన్నారని తెలిపారు. టీటీడీ ప్రాసెస్ చేసిన తలనీలాలే విక్రయిస్తుందని ఈవీ క్లారిటీ ఇచ్చారు.
టీటీడీపై.. ఇందులో ఉద్యోగులపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులు, మీడియా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో టీడీపీకి చెందిన ఓ అగ్ర పత్రికపై కూడా చర్యలు తీసుకోవాలని.. దానిపై పరువు నష్టం దావా వేయనున్నట్టు ఈవో తెలిపారు. దీంతో ఆరోపించిన టీడీపీ అనుకూల మీడియా చిక్కుల్లో పడ్డట్టు అయ్యింది.