Gyanesh Kumar: మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భారత దేశంలో ఏటా ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. మన రాజ్యాంగం ప్రకారం.. పంచాయతీ నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు అన్నీ ఐదేళ్లకోసారి జరగాలి. పార్లమెంటు(Parlment), అసెంబ్లీ(Assembly) ఎన్నికలు అలాగే జరుగుతున్నాయి. కానీ, పంచాయతీ, మున్సిపాలిటీ, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతోంది. అధికారంలో ఉన్నవారు తమకు అనుకూలంగా ఉన్న సమయంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణ సీఈసీకి పెద్ద సమస్యగా మారింది. అయినా రాజ్యాంగం ఈసీకి సర్వాధికారాలు కల్పించింది. స్వతంత్రంగా వ్యవహించే పవర్స్ ఇచ్చింది. భారత దేశంలో ఇప్పటి వరకు పలువురు ఈసీలుగా పనిచేశారు. కానీ, టీఎన్.శేషన్ కాలంలో తెచ్చిన సంస్కరణలు రాజకీయ పార్టీలకు చెమటలు పట్టించాయి. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ పదవీ కాలం ఫిబ్రవరి 18తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ కొత్త సీఈసీని నియమించింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్‌కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదముద్ర వేశారని కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఎన్నికల కమిషనర్ల నియామకంపై తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం నియమితులైన తొలి సీఈసీ జ్ఞానేశ్‌కుమార్.
రాష్ట్రపతికి ప్రదిపాదన..
అంతకుముందు సీఈసీ నియామకంపై ప్రధాని మోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సమావేశమై జ్ఞానేశ్‌కుమార్ పేరునుప్రతిపాదించాయి. ఈమేరకు రాష్ట్రపతికి సిఫారసు చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, విపక్ష నేత రాహుల్‌గాంధీ ఈ భేటీలో పాల్గొన్నారు. 26వ ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా నిమితులయ్యారు. ఈయన 2029, జనవరి 26 వరకు పదవిలో కొనసాగుతారు. మరో వైపు డాక్టర్ వివేక్‌జోషి ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు.
కేరళ కేడర్ ఐఏఎస్..
జ్ఞానేశ్‌కుమార్ కేరళ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన ముగ్గురు కమిషనర్లలో రెండో సీనియర్‌గా ఉన్నారు. మరో కమిషనర్ సుఖ్‌బీర్ సింగ్ సంధూ ఉత్తరాఖండ్ కేడర్‌కు చెందిన చెందిన వారు. జ్ఞానేశ్‌కుమార్ కేంద్ర హోంశాఖలో వివిధ విభాగాల్లో పనిచేశారు. కశ్మీర్ డివిజన్ జాయింట్ సెక్రెటరీగా ఉన్న ఆయన ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన ముసాయిదా బిల్లు రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. సుప్రీం కోర్టులో అయోధ్య రామజన్మభూమి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను నిర్వహణ బాధ్యత వహించారు. గతేడాది జనవరిలో కేంద్ర సర్వీసుల నుంచి రిటైర్ అయ్యారు.
అన్వేషణ కమిటీ సిఫారసు..
గతంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా అత్యంత సీనియర్‌గా ఉన్న ఎన్నికల కమిషనర్లను నియమించేవారు. గతేడాది కొత్త చట్టం అమలులోకి వచ్చింది. సీఈసీ, ఈసీల నియామకాలకు సంబంధించిన నూతన చట్టం ప్రకారం అన్వేషణ కమిటీ ఐదుగురు కార్యదర్శి స్థాయి అధికారుల పేర్లతో తుది జాబితాను సిద్ధం చేస్తుంది. తర్వాత ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశంలో సీఈసీ, ఈసీలను నియమిస్తుంది.
వాయిదా వేయాలన్న కాంగ్రెస్..
కొత్త సీఈసీ నియామక భేటీ నేపథ్యంలో.. ఈ ప్రక్రియను వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సీఈసీ ఎంపిక ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఫిబ్రవరి 19న సుప్రీం కోర్టు విచారణ చేయనుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఈసీ నియామకం వాయిదా వేయాలని కోరింది. కేంద్రం కొన్ని సవరణలతో ప్రభుత్వ నియంత్రణ కోరుకుంటుంది. అయితే ఈ భేటీకి రాహుల్‌గాంధీ హాజరయ్యారని చెప్పారు. ఈ మాట్లాడారనే విషయాన్ని మాత్రం కాంగ్రెస్ ధ్రువీకరించలేదు.