
BRS: వారసత్వ రాజకీయాలకు కే రాఫ్ భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్). యథారాజా.. తధాప్రజ అన్నట్లు.. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన కొడుకు, కూతురు, అల్లుడితోపాటు సడ్డకుని కొడుకును రాజకీయాల్లోకి తెచ్చి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ టికెట్లు ఇచ్చారు. కొడుకు, అల్లుడు ప్రస్తుతం కే సీఆర్ క్యాబినెట్‌లో మంత్రులుగా ఉన్నారు. కూతురు ఎమ్మెల్సీగా, సడ్డకుని కొడుకు ఎంపి పదవులు అనుభవిస్తున్నారు. తెలంగాణలో రెండు పర్యాయాలు పార్టీని అధికారంలోకి తెచ్చిన చంద్రశేఖర్‌రావు ఆదేశాలకు అనుగుణంగా ఇన్నాళ్లూ ఎమ్మెల్యేలు, మంత్రులు పనిచేశారు. టికెట్ ఇవ్వకపోయినా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించేందుకు కూడా భయపడ్డారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. తొమ్మిదేళ్ల పాలనతో ఒకవైపు ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. మరోవైపు కుటుంబ పాలనతో సొంత పార్టీ నేతలే ఇబ్బంది పడుతున్నారు. తమ వారసులను రాజకీయ రంగంలోకి దించేందుకు దే మంచి సమయమని ఎమ్మెల్యేలు, మంత్రులు భావిస్తున్నారు.ఈ మేరకు ఇప్పటి నుంచే గులాబీ బాస్‌పై ఒత్తిడి తెస్తున్నారు.
ముసలోళ్లం అవుతున్నాం..
‘నేను ముసలోడ్ని అవుతున్నా.. పోచారం కూడా అవుతున్నాడు. అయినప్పటికీ నేను ఉన్నంత కాలం పోచారం ఎమ్మెల్యేగా ఉండాలి’ ఇటీవల బాన్సువాడకు వెళ్లిన కేసీఆర్ అన్న మాటలు ఇవీ. కేసీఆర్ ఇలా ఎందుకు ప్రకటించారంటే పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. ఇక ఎన్నికల రాజకీయాలు తనవల్ల కాదని.. తన కుమారుడికి చాన్స్ ఇవ్వాలని కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆయన నేరుగా ప్రజల ముందే ఇలాంటి ప్రకటన చేసేసి.. తాను వారసులను ప్రోత్సహించాలనుకోవడం లేదని తేల్చేశారు కేసీఆర్.
ఒక్క ప్రకటనతో చాలామందిలో నిరాశ..
ఈ ప్రకటన పోచారంను నిరాశపర్చింది. ఒక్క పోచారమే కాదు.. బీఆర్‌ఎస్‌లో చాలా మంది నేతలు వారసుల ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి , మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ వచ్చే ఎన్నికల్లో తనయులను బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నారు. మంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి 2014లోనే చేవేళ్ల ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈసారి రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మల్లారెడ్డి తన ఇద్దరు తనయులు భద్రారెడ్డి, మహేందర్‌రెడ్డిలకు రాజకీయ భవిష్యత్ కల్పించాలని వ్యూహాలు రచిస్తున్నారు. తలసాని తనయుడు సాయి కూడా 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నాడు. ఎమ్మెల్యేలు సైతం తమ తనయులకు రూట్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇప్పటికే కొడుకు ప్రశాంత్‌రెడ్డితో నియోజకవర్గమంతా పాదయాత్ర చేయిస్తున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన తనయుడు రోహిత్‌రావును మెదక్ అసెంబ్లీ నుంచి బరిలోకి దింపాలనుకుంటున్నారు. ఈమేరకు అధినేతపై ఒత్తిడి చేస్తున్నారు. కాదంటే కేసీఆర్‌నే ఉదాహరణ చూపాలని భావిస్తున్నారు. ఇందుకోసం సీనియర్లంతా ఏకమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే కేసీఆర్ ఇటీవల టిక్కెట్ల కసరత్తులు కూడా ప్రారంభించారు. అన్నిరకాల నివేదికలను తెప్పించుకుని.. కొంత మంది సిట్టింగ్‌లను మార్చాలని నిర్ణయించారు. అయితే వారసులకు ఇవ్వాలా లేదా అనే దానిపై ఏ నిర్ణయం తీసుకున్నారన్నదానిపై స్పష్టత లేదు. గెలిచి తీరాల్సిన ఎన్నికలు కాబట్టి వారసుల దూరం పెడితేనే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నట్లుల బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.