Gulab Cyclone: గులాబ్ తుపాన్ కల్లోలం సృష్టిస్తోంది. ఆదివారం రాత్రి 8 గంటల తరువాత తీరాన్ని తాకిన తుపాను 11 గంటలకు పూర్తిగా తీరం దాటింది. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపల్నం, ఒడిశాలోని గోపాల్ పూర్ మద్య తుపాను కేంద్రం తీరం దాటింది. దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తపాను ప్రభావం ఉత్తరాంధ్రపై పడింది. మూడు జిల్లాల్లో వర్షం తీవ్రంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో సంతబొమ్మాలి, వజ్రపు కొత్తూరు మధ్య గులాబ్ ప్రభావం తీవ్రంగా ఉంది. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకార్ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు.

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అత్యధికంగా 58 మిమీ వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. విశాఖలోనూ గులాబ్ తీవ్రత ఎక్కువగానే ఉంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. కాన్వెంట్ జంక్షన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి కింద నడుములోతులో నీరు చేరింది. దీంతో పలు రైళ్లు రద్దయ్యాయి. ప్రయాణికులు గందరగోళంలో పడిపోయారు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు.
గులాబ్ ధాటికి తెలంగాణ, ఏపీనే కాదు పలు స్టేట్లు వణుకుతున్నాయి. ఒడిశాలో కుండపోత వర్షం కురుస్తోంది. చిల్కా సరస్సుకు వరద పోటెత్తింది. తెలుగు ప్రాంతాలే కాకుండా తమిళనాడు సైతం అల్లాడుతోంది. తీరప్రాంతంలో చాలా చోట్ల సముద్రం అల్లకల్లోలంగా మారింది. విజయనగరం జిల్లాలో కొత్తవలస ఎస్సీ కాలనీలో వరద నీరు చేరింది. ఓ కుటుంబం నీటిలో చిక్కుకోగా అధికారులు కాపాడారు.
హైదరాబాద్ లో కూడా భారీవర్షం కురుస్తోంది. జంట నగరాల్లో రోడ్లన్ని జలమయమయ్యాయ. లోతట్లు ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి. గులాబ్ తుపాను ప్రభావంతో విశాఖపట్నంలోని విమానాశ్రయంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంత ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయనగరం జిల్లాలో సువర్ణముఖి నంది మధ్యలో గొర్రెల కాపరి చిక్కుకుపోయాడు. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గులాబ్ తుపాన్ ధాటికి చంపావతి, సువర్ణముఖి నదులు పొంగిపొర్లుతున్నాయి. విజయనగరం జిల్లా గుర్ల మండలం ఎస్ఎస్ పేట వద్ద భారీగా వరదనీరు ప్రవహిస్తోంది.