Gujarat Elections: గుజరాత్.. భారతీయ జనతా పార్టీ.. ఈ రెండింటినీ వేర్వేరుగా చూడలేం. పేరుకు కేంద్రంలో అధికారంలో ఉన్నా గుజరాత్ విషయం వచ్చేసరికి నరేంద్ర మోడీకి, అమిత్ షా కు వల్లమాలిన అభిమానం. ఇక ఇప్పుడు ఆ రాష్ట్రంలో త్వరలో శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఎదురన్నది లేకుండా పరిపాలిస్తున్న బిజెపి.. ఈసారి కూడా గుజరాత్ లో పాగా వేయాలని పావులు కదు పుతోంది. ఇందులో భాగంగానే ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ రాకముందే తన ప్రణాళికలను అమల్లోకి పెట్టింది. ఇప్పటికీ బీజేపీ తన బలమైన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నే భావిస్తోంది. గతంలో ఆ పార్టీ చేసిన తప్పులను ఎత్తి చూపుతోంది. అయితే కాంగ్రెస్ ను విమర్శించేటప్పుడు ఆచితూచి మాట్లాడే నరేంద్ర మోడీ, అమిత్ షా ఈసారి మాత్రం డోస్ పెంచారు. మొన్న మహాకాళేశ్వర్ ఆలయ పున: ప్రారంభ సభలో నరేంద్ర మోడీ మాట్లాడారు. కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు. అన్నిటికంటే ముఖ్యంగా పాకిస్తాన్ ఇవాల్టికి కూడా రావణ కాష్టం లాగా రగులుతోందంటే దానికి కారణం జవహర్లాల్ నెహ్రూ అని మోడీ విమర్శించారు. ఇది జరిగిన రెండు రోజులకే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నరేంద్ర మోడీ పల్లవినే అందుకున్నారు.

ఎందుకు నెహ్రూని టార్గెట్ చేశారు
త్వరలో గుజరాత్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం అహ్మదాబాద్ జిల్లా బంజార్కా, ఉనాయ్ లో బిజెపి గౌరవ్ యాత్ర ప్రారంభించారు. సందర్భంగా ఆయన దివంగత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370 ని రాజ్యాంగంలో పొందుపరచడమే నెహ్రూ చేసిన అతిపెద్ద తప్పని అమిత్ షా ధ్వజమెత్తారు. ఆ తప్పు వల్లే కాశ్మీర్ ఇప్పుడు పెద్ద సమస్య అయి కూర్చుందన్నారు. ఆ ప్రాంతం దేశంతో సరిగ్గా విలీనం కానందునే ప్రతి ఒక్కరూ ఆర్టికల్ 370 ని తొలగించాలని కోరుకున్నారని అమిత్ షా అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ 2019లో ఒక్కవేటుతో 370 రద్దుచేసి కాశ్మీర్ ను దేశంలో విలీనం చేశారని అమిత్ షా పేర్కొన్నారు. ” అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామంటూ బిజెపి చేసిన వాగ్దానాన్ని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. కానీ మందిరం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది” అని అమిత్ షా ధ్వజమెత్తారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 ఎయిర్ స్ట్రైక్స్ వల్లే సీమాంతర ఉగ్రవాదులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని అభిప్రాయపడ్డారు. ” గతంలో యూపీఏ హయంలో పాకిస్తాన్ ఆర్మీ మన సైనికుల తలలను నరికి వెంట తీసుకెళ్లింది. 2014లో బిజెపి ప్రభుత్వం వచ్చాక కూడా అలాగే చేయాలని అనుకుంది. కానీ ఇది మౌని బాబా( మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఉద్దేశిస్తూ) ప్రభుత్వం కాదన్న విషయం వాళ్లు మరిచారని” అమిత్ షా వివరించారు.

గుజరాత్లో కాంగ్రెస్ అధికారం ఉన్న సమయంలో ఏడాదిలో 365 రోజులకు గాను 2500 రోజులు కర్ఫ్యూ యే అమలయ్యేది. కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక గత 20 ఏళ్లుగా అటువంటి పరిస్థితులు లేవని అమిత్ షా వివరించారు. అయితే ప్రస్తుతం రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందనే సంకేతాలు రావడంతో మోడీ, అమిత్ షా ముందుగానే గుజరాత్ లో ఎన్నికల ప్రచారానికి దిగారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా జవహర్లాల్ నెహ్రూ గతంలో చేసిన తప్పులను ఉటంకిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వ్యూహాత్మకంగా పాకిస్తాన్ ప్రస్తావన తీసుకొస్తున్నారు. ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ పాకిస్తాన్ ఉగ్రవాదుల వల్ల తీవ్రమైన నష్టాన్ని చవిచూసినవే. అందుకే ప్రజలు కాంగ్రెస్ వైపు మళ్ళకుండా.. గతంలో కాంగ్రెస్ నాయకులు చేసిన గాయాలను మళ్లీ రఫిలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎన్నికల నోటిఫకేషన్ రాకముందే గుజరాత్ లో కాక రగిలించిన మోడీ షా ద్యయం.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పై ఎలాంటి విమర్శలు చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.