Unstoppable With NBK- Chandrababu: రాజకీయ రంగంలో దారిపొడవునా ముళ్ల కిరీటాలు, కంచెలు, రాళ్లబండలు ఉంటాయి. అదే సమయంలో పూల పాన్పులు కూడా ఎదురవుతుంటాయి. కానీ కష్ట సుఖాలను, సంక్షోభాలను అధిగమించుకొని ముందుకు సాగితేనే అగ్రపీఠానికి చేరుకోగలం. అయితే రాజకీయ ప్రయాణంలో ఎన్నో మాయని మచ్చలు పడతాయి. అయితే ఈ విషయంలో మాత్రం ప్రధాన బాధితుడు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉమ్మడి ఏపీని సుదీర్ఘ కాలం పాటు ఏలి రికార్డు సొంతం చేసుకున్నా.. అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అరుదైన అవకాశం దక్కించుకున్నా మాత్రం ఓ అపవాదు వెంటాడుతునే ఉంది. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారన్న ఆరోపణ రెండు దశాబ్దాలకుపైగా నీడలా ఆయన వెంట నడుస్తునే ఉంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు నందమూరి బాలకృష్ణ. తన అన్ స్టాపబుల్ సీజన్ 2 లో ఫస్ట్ ఎపిసోడ్ ద్వారా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ తో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. అయితే దీనికి సంబంధించిన ప్రోమో తెలుగు నాట కొత్త ఆసక్తిని రేపింది. చంద్రబాబు భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు హల్ చల్ చేస్తున్నాయి.

అయితే 1995 రాజకీయ సంక్షోభం జరిగి రెండున్నర దశాబ్దాలు దాటుతున్నా.. నాటి ఘటనలో చంద్రబాబునే దోషిగా చూపిస్తూ వచ్చారు. అటు తరువాత చంద్రబాబు ప్రజామోదం పొందినా.. రాజకీయ ప్రత్యర్థులకు మాత్రం ప్రచారాస్త్రంగా మారింది. నాటి పరిణామాలపై అనేక సార్లు చంద్రబాబు వివరణలు ఇచ్చుకున్నా అనుమానాలకు మాత్రం తెరపడలేదు. ఇటువంటి తరుణంలో అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా దీనికి తెరదించాలని చంద్రబాబు ప్రయత్నించినట్టున్నారు. నందమూరి వారసుడు హోస్ట్ స్థానంలో ఉండగా నాడు జరిగిన ఘటనల గురంచి తలచుకుంటూ చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. బాలక్రిష్ణ సమక్షంలోనే నాటి సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ కాళ్లవేళ్లా పట్టుకున్నట్టు కూడా ప్రోమోలో చెప్పుకొచ్చారు. అయితే ప్రోమోలోనే ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేస్తే.. పూర్తి ఎపిసోడ్ లో నాటి ఘటనపై పూర్తి క్లారిటీతో మాట్లాడి ఉండి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్టీఆర్ వారసత్వంపై చాలా రోజుల నుంచి చర్చ నడుస్తునే ఉంది. వారసులు ఇప్పుడు చెరో పార్టీలో కొనసాగుతున్నారు. టీడీపీ ఎన్టీఆర్ బొమ్మతో పార్టీని కొనసాగిస్తోంది. అటు నందమూరి వారసులంతా టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి వైసీపీలో ఉన్నారు. కుమార్తె పురందేశ్వరి బీజేపీలో కొనసాగుతున్నారు. అటు హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో దూసుకుపోతున్నారు. అటు తాత స్థాపించిన పార్టీ టీడీపీలో యాక్టివ్ గా లేరు. ఇటీవల ఆయన బీజేపీకి సపోర్టు చేస్తున్నట్టు కథనాలు నడిచాయి. ఈ విరుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఎన్టీఆర్ ను ఓన్ చేసేందుకు అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామ క్రమాలను గమనించిన చంద్రబాబుకు బావమరిది హోస్ట్ గా కొనసాగుతున్న అన్ స్టాపబుల్ అనుకోని వేదికగా కలిసివచ్చింది.

అసలు ఎన్టీఆర్ కు సంబంధంలేని వైసీపీ సైతం ఆయన్న ఓన్ చేసేందుకు ప్రయత్నించింది. ఇందుకు ఆయన భార్య లక్మ్షీపార్వతిని పావుగా వినియోగించుకుంది. అలాగే పునర్విభజనలో జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి తాము కూడా ఎన్టీఆర్ వారసులమని చెప్పడానికి ప్రయత్నించింది. అయితే అంతలోనే పప్పులో కాలేసింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చింది. టీడీపీకి విమర్శనాస్త్రాన్ని అందించింది. ఒక విధంగా తిరిగి ఎన్టీఆర్ ను టీడీపీకి దగ్గర చేసింది ఈ పరిణామమే. ఇన్నాళ్లు టీడీపీకి దూరంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు టీడీపీలోకి పునరాగమనం కావడానికి ఈ ఘటనే కారణం కావడం గమనార్హం.
అయితే తాజాగా వైసీపీ కొత్త ఎత్తుగడ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా చంద్రబాబే అడ్డుకున్నారన్న ప్రచారాన్ని పదునెక్కిస్తోంది. అంతటితో ఆగకుండా ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ప్రకటించాని కోరుతూ కేబినెట్ లో తీర్మానించి ఆమోదించి కేంద్రానికి పంపనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి నాడు ఎన్టీఏ కన్వీనర్ గా ఉన్నప్పుడు చంద్రబాబు ఒక మాట చెబితే సరిపోయేది. కానీ నాడు భారతరత్న ప్రకటిస్తే ఎన్టీఆర్ భార్యగా లక్ష్మీపార్వతియే అందుకోవాలి. అది చంద్రబాబుకు ఇష్టం లేకే సిఫారసు చేయలేదన్న టాక్ ఉంది. ఇప్పుడు అదే పనిచేసి ఇరకాటంలో పెట్టాలన్న తలంపులో జగన్ సర్కారు ఉంది. కానీ దీనిపై కూడా టీడీపీ అస్త్రాలను సిద్ధం చేసుకొని రెడీగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికైతే బాలక్రిష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ఎన్నో అనుమానాలను నివృత్తి చేయనుంది.