GST On Idli And Dosa: గతంలో అనేక స్లాబులున్న జిఎస్టి లో సరళీకృతం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం రెండు స్లాబులు మాత్రమే ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇది దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని.. పన్ను విధానంలో సరికొత్త చరిత్రకు నాంది పలుకుతుందని మోడీ ప్రకటించారు. ప్రజల జీవన విధానంలో కూడా మార్పు వస్తుందని.. ప్రజల ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ జీఎస్టీ విధానంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో నిరసనకు కారణమవుతోంది.
దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటకలో కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో కూటమి, తమిళనాడులో డిఎంకె, కేరళలో వామపక్ష పార్టీ అధికారంలో ఉన్నాయి. కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాలలో బిజెపి ఇంతవరకు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తున్నప్పటికీ అవి అంతగా ఫలప్రదం కావడం లేదు. దక్షిణాది రాష్ట్రాల ప్రజల అవసరాలు ఏమిటో.. ఏ విధంగా అయితే వారు ఆదరిస్తారో ఇప్పటివరకు బిజెపికి ఒక దిశ అంటూ లేకుండా పోయింది. పైగా నాయకత్వం మార్పులను ఎప్పటికప్పుడు చేపడుతూ ఉండడం ఇక్కడి రాష్ట్రాలలో బిజెపికి దెబ్బగా మారింది. అటువంటి వాటి నుంచి గుణ పాఠాలు నేర్చుకోకపోగా.. మరింత పనికిమాలిన నిర్ణయాలను బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్నది. అది అంతిమంగా ఇక్కడ ప్రజల జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా జిఎస్టి విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ దక్షిణాది ప్రజలు ఇష్టంగా తినే ఇడ్లీ, దోశలపై జీఎస్టీ విధానాన్ని యధావిధిగా ఉంచడం పట్ల నిరసన వ్యక్తం అవుతుంది. ఉత్తరాది రాష్ట్రాలలో తినే చపాతి, పరోటా పై జిఎస్టి లేకుండా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలలో ప్రజలు ఇష్టంగా తినే ఇడ్లీ, దోశలపై ఐదు శాతం జిఎస్టి విధానాన్ని అమలు చేయడం పట్ల ఇక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర రాష్ట్రాలలోని ప్రజల తినే అల్పాహారాలపై పన్ను తొలగించి.. ఇక్కడి ప్రజలు తినే వంటకాలపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని ఏపీ శాసనసభలో ఎమ్మెల్యే రామకృష్ణ ప్రస్తావించారు. అయితే దానిపై కూటమినేతలు ఎటువంటి మాటలు మాట్లాడలేదు. మరోవైపు కొందరు దక్షిణాది వంటకాలపై కేంద్రం కక్ష కట్టిందని.. జీఎస్టీతో ప్రజల తినే ఆహారంపై కూడా ఉక్కు పాదం మోపుతోందని ఆరోపిస్తున్నారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.