CM KCR: చిలిపి, చిల్లర పనుల వల్ల గొప్ప గొప్ప అవకాశాలు కోల్పోతారు: ఆ ఎమ్మెల్యే ఉదంతాన్ని వివరించిన కేసీఆర్!

సుదీర్ఘ విశ్రాంతి తర్వాత కేసీఆర్ పార్టీ నాయకులతో ఇష్టా గోష్టిగా మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల సంఘం విధిస్తున్న నిబంధనలు అన్నింటిపై కేసీఆర్ చర్చించారు.

Written By: K.R, Updated On : October 15, 2023 2:52 pm

CM KCR

Follow us on

CM KCR: “నా రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. గొప్ప గొప్ప నాయకులను చూశాను. కొంతమంది అద్భుతమైన అవకాశాలను ఒడిసి పట్టుకున్నారు. మరికొందరేమో చిల్లర, చిలిపి పనుల వల్ల అవకాశాలను కోల్పోయారు. వారు ఆ పనులు చేసి ఉండకపోతే ఇంకా గొప్ప స్థానాల్లోకి వెళ్లిపోయి ఉండేవారు. అలాంటి పనులు చేసి ఇప్పుడు సోయి లోనే లేకుండా పోయారు. అందుకే రాజకీయ నాయకులు స్పృహలో ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. చిల్లర పనులు చేస్తే ఆగం అయిపోతారు” ఇవీ ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.

సుదీర్ఘ విశ్రాంతి తర్వాత కేసీఆర్ పార్టీ నాయకులతో ఇష్టా గోష్టిగా మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల సంఘం విధిస్తున్న నిబంధనలు అన్నింటిపై కేసీఆర్ చర్చించారు. పార్టీ అభ్యర్థులకు పలు విషయాల మీద సూచనలు చేశారు. కేవలం 51మందికి మాత్రమే బీ పామ్స్ అందజేశారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ లైన్ దాటితే, అడ్డగోలుగా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు ఎన్నికల సమయంలో జాగ్రత్తగా ఉండాలని, పార్టీ పేరును చెడ్డ పేరు తీసుకొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఈ సందర్భంగా పేరు చెప్పకుండానే ఒక ఎమ్మెల్యే ఉదంతాన్ని ఉదాహరించారు. “పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న అతడు చిల్లర పనులు చేశాడు. చిలిపి వివాదంలో తల దూర్చాడు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఆ నాయకుడు ఇబ్బందుల పాలయ్యాడు. గొప్ప గొప్ప స్థానాలను అధిరోహించాల్సిన సమయంలో తల దించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. దీనివల్ల అతడికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అతడు చేసిన నిర్వాకం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది” అని కెసిఆర్ వివరించారు. కెసిఆర్ మాట్లాడుతున్నంత సేపు.. ఆ ఎమ్మెల్యే గురించి చెబుతున్నంతసేపు.. అభ్యర్థులు తీవ్రంగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అంటే ఈ లెక్కన పార్టీ లైన్ దాటితే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని కేసీఆర్ నేరుగా సంకేతాలు ఇచ్చారు. సమావేశం ముగిసిన తర్వాత చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, సర్పంచ్ నవ్య ఉదంతాన్ని గురించి చర్చించుకోవడం కనిపించింది.