Revanth: తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు పెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటోంది. వేలకోట్ల రూపాయాలతో తాగు, సాగునీటి ప్రాజెక్టులు కడుతున్నామని, ప్రతీ ఎకరాకు నీరందిస్తున్నామని, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు భీమా వంటి పథకాలు ఎన్నో ఇస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటోంది. ఇవన్నీ అందుతున్నాయా? లేవా అన్న విషయం పక్కన పెడితే రైతు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మనసు రాకపోవడం శోచనీయంగా మారింది.
రైతులు పంటలు పండించి కళ్లాల్లో ధాన్యాన్ని ఆరబెట్టిన సమయం నుంచే కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేయడం ప్రారంభించింది. పంజాబ్ లో రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం సేకరిస్తుందని.. తెలంగాణలో ఎందుకు సేకరించదంటూ కేంద్రంతో కేసీఆర్ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలంతా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపిన ఘటనలు ఇటీవల కాలంలో చోటుచేసుకున్నాయి.
తాజాగా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిమరీ బీజేపీ సర్కారుపై నిందలు వేయడం ప్రారంభించారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్దంగా లేదంటూ అందువల్లే ధాన్యం సేకరణ ఆలస్యం అవుతుందని నెపాన్ని బీజేపీపై మోపే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ నేతలు సైతం టీఆర్ఎస్ సర్కారుపై మాటలయుద్ధానికి దిగారు. ఇలాంటి సమయంలో శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన రేవంత్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కారు తీరును ఎండగట్టారు.
Also Read: విరోధులు ఒక్కటైన వేళ.. దీక్షలో రేవంత్-కోమటిరెడ్డి కలయిక వెనుకున్నదెవరు?
సీఎం కేసీఆర్ తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటారని అయితే ఆచరణలో మాత్రం ఎక్కడా కన్పించడం లేదని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు కళ్లాల్లో చనిపోతున్నారని అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేసీఆర్ సర్కారు కొనుగోలు చేయలేనప్పుడు వేలకోట్ల రూపాయాలతో ప్రాజెక్టులు కట్టడం ఎందుకు? రైతుబంధు ఎందుకు అంటూ ప్రశ్నించారు.
కేంద్రం ధాన్యం కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనదా? అంటూ నిలదీశారు. సీఎం కేసీఆర్ కు వ్యవసాయంపై ఒక పాలసీ అంటూ ఉందా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. నిజామాబాద్ లో పసుపు బోర్డుపై బీజేపీ రైతులను మోసం చేస్తే.. టీఆర్ఎస్ చెక్కర ఫ్యాక్టరీలను మూసివేసి నష్టం చేసిందన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు రెండు కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వాలేనని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలకు కొందరు టీఆర్ఎస్ ఎంపీ రాకపోవడంలో అంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు.
Also Read: రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య సయోధ్య కుదిరిందా?