దేశంలో ప్రధానంగా ఆక్సీజన్, రెమ్ డెసివర్ లాంటి మందుల కొరత వేధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే.. వేలాది మంది ప్రాణాలు పోతున్నాయి. సోషల్ మీడియా కేంద్రం కరోనాపై తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ట్విటర్లో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తున్నారు.
అయితే.. దేశంలో ఆందోళనకర పరిస్థితులు ఉన్న ఇలాంటి సందర్భంలో ఈ విమర్శనాత్మక ట్వీట్లుమరింత గందరగోళాన్ని సృష్టిస్తాయని భావించిన ప్రభుత్వం.. తాజాగా 52 ట్వీట్లను బ్లాక్ చేయించింది. ఐటీ చట్టం ప్రకారం ట్విటర్ ను ఆదేశించగా.. ఈ మేరకు ఆ సంస్థ ట్వీట్లను తొలగించింది. ఇందులో తెలంగాణ ఎంపీ రేవంత్ రెడ్డి సహా.. చాలా మంది ప్రముఖులు ఉన్నారు.
ఆక్సీజన్ కొరతను ప్రస్తావిస్తూ.. మోదీ సర్కారుపై రేవంత్ విమర్శనాత్మక ట్వీట్ చేశారు. దీంతో.. ఆయన పోస్టును ట్విటర్ బ్లాక్ చేసింది. ఆయనతోపాటు బెంగాల్ మంత్రి మోలాయ్ ఘటక్, నటుడు వినీత్ కుమార్ సింగ్, ఫిల్మ్ మేకర్లు వినోద్ కాప్రి, అవినాష్ దాస్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
గతంలో రైతు ఉద్యమం సందర్భంలోనూ ఈ విధంగా.. పలు ట్వీట్లను, అకౌంట్లను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా.. ట్వీట్లను తొలగించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై కేంద్రం దృష్టి పెట్టిందని అర్థమవుతోంది. అయితే.. ఈ చర్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లోపాలను సరిదిద్దుకోవాలే తప్ప, ప్రశ్నించిన వారిని ఇలా బ్లాక్ చేయడం సరికాదని అంటున్నారు.