KCR- Governor Tamilisai: తెలంగాణలో దాదాపు రెండేళ్లుగా గవర్నర్, గవర్నమెంట్ మధ్య సాగుతున్న ప్రశ్చన్న యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తాజాగా ఇటీవల గణతంత్ర వేడుకల సాక్షిగా కొత్త మలుపు తిరిగింది. గవర్నర్‌ను రాజ్‌భవన్‌కు పరిమితం చేయాలని చూసిన కేసీఆర్‌పై రి‘పబ్లిక్’ సాక్షిగా తమిళిసై విమర్శలు చేశారు. రోజు రోజుకూ ప్రగతి భవన్, రాజ్‌భవన్‌కు మధ్య పెరుగుతున్న దూరం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. గవర్నర్ చర్యలపై తెలంగాణ ప్రభుత్వం ఏకంగా హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. మరో నాలుగు రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 3న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టాలని నిర్ణయిచింది. ఇందుకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు అనుమతి రాలేదు. ఇదే సమయంలో గవర్నర్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ఒక రిటర్న్ కమ్యూనికేషన్ వెళ్లింది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కు అనుమతించేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ ప్రభుత్వం సోమవారం లంచ్‌మోషన్ పిటీషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది.

ప్రభుత్వం వర్సస్ గవర్నర్
తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఢిల్లీలో.. ఇటు రాజ్‌భవన్ వేదికగా గవర్నర్ ఓపెన్ గానే తన ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటు ప్రభుత్వంలోని మంత్రుల నుంచి గవర్నర్ తీరుపై అభ్యంతరం చేస్తూ వ్యాఖ్యలు వినిపించాయి. ఇదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గతేడాది గవర్నర్ ప్రసంగం లేకుడానే బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అయినా గవర్నర్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. కానీ ఈసారి బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం లభించలేదు. ప్రభుత్వం ఈ నెల 21న గవర్నర్‌కు లేఖ పంపింది. దీనికి ఇప్పటి వరకు గవర్నర్ ఆమోదించ లేదు. నాలుగు రోజుల్లో సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ ప్రసంగం కాపీ పంపాలని గవర్నర్ ప్రభుత్వానికి లేఖ పంపింది. దీంతో కేసీఆర్ సర్కార్ ఇరకాటంలో పడింది.

గవర్నర్ ఆహ్వానించకుండానే..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్‌ను ఆహ్వానించకూడదని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈమేరకు బడ్జెట్ ప్రతిపాదనలను గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపించారు. కానీ, గవర్నర్ అసెంబ్లీ సమావేశాల ప్రసంగం కాపీ అడగడంతో సర్కార్ నుంచి సమాధానం ఇవ్వలేదు. అసెంబ్లీ ప్రోరోగ్ కాలేదని, గవర్నర్ ప్రసంగం అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో బడ్జెట్ ఆమోదంపై గవర్నర్ నిర్ణయం తీసుకోకపోవటం.. సమయం సమీపిస్తుండటంతో హైకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం లంచ్‌మోషన్ పిటిషన్ వేయనుంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేను ఇందుకోసం రంగంలోకి దించింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.