Visakhapatnam Capital: ఏపీలో గత మూడున్నరేళ్లుగా రాజధాని ఇష్యూ చూపినంత ప్రభావం మరి దేనికీ లేదు. జగన్ సర్కారు అధికారం చేపట్టాక అప్పటివరకూ ఉన్న అమరావతికి కాదని.. మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. అది మొదలైంది ఇప్పటివరకూ ఎండ్ కార్డుపడడం లేదు. రాజధాని లేని నగరంగా ఏపీ దేశంలో నిలిచిపోయిందంటూ విమర్శలు వచ్చినా జగన్ సర్కారు వెనక్కి తగ్గలేదు. మూడు రాజధానులు అన్నాం కాబట్టి ఏర్పాటుచేసి తీరాల్సిందేనన్న మొండి పట్టుదల తప్పించి మరో ఆలోచనచేయడం లేదు. అలాగని ముందుకు అడుగులు పడుతున్నాయి అంటే అదీ లేదు. ఏటా పలానా నెలకు విశాఖ నుంచి పాలన సాగిస్తామన్న ప్రకటనలే కానీ.. అవేవీ కార్యరూపం దాల్చిన పరిస్థితులు లేవు. ఇప్పుడు తాజాగా ఏప్రిల్ నుంచి అని మంత్రులు చెబుతున్నారు. ఈ డెడ్ లైన్ దాటితే మాత్రం విశాఖ రాజధాని తరలింపు అనేది ఇప్పట్లో జరగే పని కాదు.

ప్రస్తుతం రాజధాని ఇష్యూ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. కొద్దిరోజుల్లో తీర్పు రానుంది. అయితే తమకు అనుకూలంగా వస్తుందని అటు ప్రభుత్వం, ఇటు రైతులు, విపక్షాలు ఆశాభావంతో ఉన్నాయి. అయితే కోర్టు తీర్పుతో పనిలేకుండా విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీసు ప్రారంభించి పాలిస్తే ప్రజలకు రాజధానిపై కట్టుబడి ఉన్నామన్న సంకేతం పంపినట్టవుతుందని జగన్ సర్కారు భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అటు మంత్రులు సైతం క్యాంప్ ఆఫీసులకు భవనాలు సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం సాగింది. దాదాపు ఉగాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని కూడా చెప్పుకొచ్చారు. ఒక వేళ కోర్టు నుంచి అనుకూల తీర్పు వస్తే సచివాలయం సైతం తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
మరోవైపు అదిగో తరలింపు.. ఇదిగో తరలింపు అంటూ మంత్రులు చేస్తున్న ప్రకటనలు కూడా గందరగోళానికి కారణమవుతున్నాయి. అమరావతి రైతులకు, విపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇచ్చే క్రమంలో మంత్రులు, వైసీపీ కీలక నేతలు చేస్తున్న ప్రకటనలు అయోమయానికి గురిచేస్తున్నాయి. తీరా మంత్రుల ప్రకటన గడువు వచ్చేసరికి.. మళ్లీ దానిని పొడిగిస్తూ మాట్లాడుతున్నారు. తాజాగా టీటీడీ చైర్మన్, ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జి వైవీ సుబ్బారెడ్డి ఉగాదికి అటు ఇటుగా విశాఖ నుంచి పాలన మొదలవుతుందని చెప్పుకొచ్చారు. ఈసారి మాత్రం ఆ గడువు దాటితే మరి తరలించే చాన్స్ వైసీపీ సర్కారుకు ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు.

వైసీపీ సర్కారుకు ఇదే చివరి అవకాశంగా తెలుస్తోంది. సాధారణంగా సచివాలయం తరలింపులో ఉద్యోగులదే కీలక భూమిక. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఉద్యోగులు తెలంగాణ నుంచి ఏపీకి రావడం తప్పనిసరిగా మారింది. అయితే అప్పట్లో కుటుంబాలతో కుదరడం కాదని.. విద్యాసంవత్సరం పూర్తయ్యే వరకూ ఆగాలని ఉద్యోగుల విన్నవించుకున్నారు. వారి కోసం వారం వారం ప్రత్యేక రైలు సర్వీసులు సైతం నడిచాయి. ఇప్పుడు ఉన్నపలంగా సచివాలయం విశాఖ తరలిస్తామంటే అటువంటి పరిస్థితే ఉత్పన్నమయ్యే అవకాశముంది. ఉద్యోగులు మేలో తరలింపు ప్రక్రియ పెట్టుకోవాలని కోరుతున్నారు. అయితే గతంలో మాదిరిగా వాయిదాలు వేయడమంటే కుదిరే పనికాదు. ఏప్రిల్ తరువాత తరలిస్తే సరేసరి.. లేకుంటే కురదని ఉద్యోగులు తేల్చుతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు కావడంతో ఉద్యోగులు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తారు. అప్పడు ప్రభుత్వాన్ని లైట్ తీసుకుంటారు. అందుకే విశ్లేషకులు రాజధాని తరలింపులో జగన్ కి ఇది లాస్ట్ చాన్స్ గా అభిప్రాయపడుతున్నారు.