https://oktelugu.com/

ఎమ్మెల్సీ భర్తీకి గవర్నర్ నో.. రాజ్ భవన్ కు జగన్?

ఏపీ సీఎం జగన్ ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీల భర్తీకి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మోకాలడ్డారు. ఐదు రోజుల కిందటే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లేముందుకు గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీలను ఖాయం చేసి గవర్నర్ ఆమోదం కోసం సీఎం జగన్ సర్కార్ పంపింది. అయితే ఐదురోజులైనా వీటికి అనుమతి రాలేదు. జాబితాలో పేరున్న నలుగురు ఇక తాము ఎమ్మెల్సీలు అయిపోయామని సంబరపడ్డారు. కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. గవర్నర్ సంతకం పెట్టలేదు. ఆపేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం […]

Written By:
  • NARESH
  • , Updated On : June 14, 2021 3:15 pm
    Follow us on

    ఏపీ సీఎం జగన్ ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీల భర్తీకి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మోకాలడ్డారు. ఐదు రోజుల కిందటే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లేముందుకు గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీలను ఖాయం చేసి గవర్నర్ ఆమోదం కోసం సీఎం జగన్ సర్కార్ పంపింది.

    అయితే ఐదురోజులైనా వీటికి అనుమతి రాలేదు. జాబితాలో పేరున్న నలుగురు ఇక తాము ఎమ్మెల్సీలు అయిపోయామని సంబరపడ్డారు. కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. గవర్నర్ సంతకం పెట్టలేదు. ఆపేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఆరాతీస్తే ఆశ్చర్యకర విషయం వెలుగుచూసింది. ఇద్దరు అభ్యర్థులపై వైసీపీ నేతలే ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వారి క్రిమినల్ కేసులపై నేతలు ఆధారాలతో సహా గవర్నర్ వద్దకు పంపగా.. గవర్నర్ సమాచారంను అధికారుల నుంచి కూడా తెప్పించుకుంటున్నారని సమాచారం.

    . తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, గుంటూరుకు చెందిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి అభ్యర్థిత్వాలపై వైసీపీ వర్గాల నుండే గవర్నర్ కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో గవర్నర్ ఎమ్మెల్సీలు జాబితాను పెండింగులో పెట్టారని సమాచారం. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి నేరుగా రంగంలోకి దిగి ఈరోజు సాయంత్రం గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసేందుకు వెళుతున్నారు.

    తెలుగుదేశం పార్టీకి చెందిన టిడి జనార్ధన్, బీద రవిచంద్ర యాదవ్, గౌనివాని శ్రీనివాసులు, పి.శమంతకమణి ఎమ్మెల్సీ పదవులు జూన్ 12వ తేదీతో ముగిసాయి. గవర్నర్ కోటాలోని ఈ నాలుగు ఎమ్మెల్సీ పదవుల భర్తీకి వైసీపీకి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన కొయ్యే మోషేనురాజు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, గుంటూరుకు చెందిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రమేష్ యాదవ్ పేర్లతో ఒక జాబితాను గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోంది.

    అయితే ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఢిల్లీ పర్యటన హడావుడిలో ఉన్న సమయంలోనే కొందరు వైసీపీ ముఖ్యులు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ జాబితాపై అసంతృప్తితో చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు గత సార్వత్రిక ఎన్నికలలో టిడిపి తరపున పోటీ చేసి ఓటమి పాలయిన తరువాతే వైసీపీలో చేరారు. రామచంద్రపురంకు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రస్తుతం రామచంద్రపురం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణలకు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుతో రాజకీయ శతృత్వం ఉంది. అప్పటిలో బోస్, వేణుగోపాలకృష్ణ అభ్యంతరాలను త్రోసిరాజని త్రిమూర్తులును సిఎం జగన్ వైసీపీలో చేర్చుకున్నారు. ఆ తరువాత కొద్ది కాలానికే త్రిమూర్తులుకు అమలాపురం పార్లమెంట్ వైసీపీ అధ్యక్ష పదవితో పాటు మండపేట అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ పదవి కూడా కట్టబెట్టారు. త్రిమూర్తులుపై దళితులకు శిరోముండనం చేసిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం క్రింద కేసు దశాబ్దాల తరబడి పెండింగులో ఉంది. ఆ కేసు నుండి కాపాడుకోవడానికే త్రిమూర్తులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారుతూ తనను తాను కాపాడుకుంటున్నారనేది ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఈ కేసునే ఇప్పుడు ఆయన రాజకీయ ప్రత్యర్ధులు అస్త్రంగా సంధించారు.

    ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల జాబితాలో తోట త్రిమూర్తులు పేరు సిఫారసు చేసిన వెంటనే వైసీపీలోని ఆయన ప్రత్యర్ధులు పావులు కదిపి గవర్నర్ కార్యాలయానికి సదరు కేసు వివరాలతో ఫిర్యాదులు చేరవేయడంలో చక్రం తిప్పారనే ప్రచారం జరుగుతోంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో రాజోలు ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయిన బొంతు రాజేశ్వరరావు కూడా ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. ఆయనకు అన్యాయం జరిగిందనే వాదన కూడా వైసీపీలోని ఒక వర్గం తెర మీదకు తీసుకు వచ్చింది. ఈ నేపథ్యంలో త్రిమూర్తులుపై ఫిర్యాదులు ఎవరు చేశారా అనేది చర్చనీయాంశంగా మారింది.

    అదే విధంగా గుంటూరు జిల్లా విషయానికి వస్తే చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ అనుచరులు కూడా తాజా ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితాపై గుర్రుగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు చిలకలూరిపేట వైసీపీ ఇంఛార్జిగా అక్కడ పోటీకి సిద్ధమైన మర్రి రాజశేఖర్ కు చివరి క్షణంలో వైసీపీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. తెలుగుదేశం నుండి వచ్చిన విడదల రజనికి టికెట్ ఇచ్చింది. అయితే ఎన్నికల ప్రచార సమయంలో స్వయంగా జగన్ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే రెండేళ్ళు గడిచినా రాజశేఖర్ కు ఏ పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలోనే లేళ్ళ అప్పిరెడ్డి పేరు ఎమ్మెల్సీ పదవికి సిఫారసు కావడంతో అప్పిరెడ్డిపై ఉన్న క్రిమినల్ కేసుల జాబితాతో రాజ్ భవన్ కు ఫిర్యాదులు పంపినట్లు వైసీపీ వర్గాలలోనే ప్రచారం జరుగుతోంది.

    అటు తోట త్రిమూర్తులు, ఇటు లేళ్ళ అప్పిరెడ్డి కారణంగా ఎమ్మెల్సీల జాబితాకు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవడంతో స్వయంగా జగన్ రంగంలోకి దిగి గవర్నర్ కు నచ్చజెప్పి జాబితా ఆమోదానికి ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ తరువాత వైసీపీలో అంతర్గతంగానైనా అసమ్మతి రాజకీయాలు మొదలయ్యాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

    ఎమ్మెల్సీ కోటా భర్తీ పూర్తిగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఒకసారి గవర్నర్ రిజెక్ట్ చేసినా మరోసారి పంపితే ఆమోదించాల్సిందే. కానీ రిజెక్ట్ చేయకముందే గవర్నర్ వద్దకు వెళ్లి జగన్ రిక్వెస్ట్ చేయబోతున్నారు. దీంతో గవర్నర్ కూడా తప్పక ఆమోదిస్తారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.