TRS vs Governar: తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్‌చార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మళ్లీ హస్తిన పర్యటనకు వెళ్లారు. రేపు ఆమె మోదీ, షాలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ రాజకీయాలు మళ్లీ ఢిల్లీ కేంద్రంగా హాట్‌టాపిక్‌గా మారాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పది రోజుల క్రితం హస్తిన పర్యటనకు వెళ్లిన ఆమె ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తనపై వ్యవహరిస్తున్న తీరు, ప్రోటోకాల్ వివాదంతో పాటు రాజకీయ పరిస్థితులపైనా నివేదిక సమర్పించారు.
-మరోమారు ప్రధాని, అమిత్‌షాతో..
తాజాగా మరోసారి ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ తమిళిసై కేంద్ర సహాయమంత్రి జితేందర్‌సింగ్ కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ప్రధాని, కేంద్ర మంత్రులను మరోసారి కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంతో ఆమె ఏయే విషయాలు చర్చిస్తారనేది ఆసక్తిగా మారింది. గత పర్యటనలో మోదీ, షాలతో భేటీ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెలంగాణ మంత్రులు ఒక్కొక్కరిగా ఆమె వ్యాఖ్యలను ఖండించారు. కొందరైతే అసలు గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
-భద్రాద్రిలోనూ ప్రొటోకాల్ ఉలలంఘన..
మొన్నటి హస్తిన పర్యటన తర్వాత గవర్నర్ భద్రాద్రి కొత్తగూడెం పర్యటనకు వెళ్లగా అక్కడా అధికారులు మొహం చాటేసి ప్రోటోకాల్ అతిక్రమించారు. అనంతరం భద్రాచలం శ్రీరామ పట్టాభిషేకానికి హాజరుకాగా అక్కడా అవమానమే ఎదురైంది. అయితే ఇవన్నీ పట్టించుకోని గవర్నర్ రెండ్రోజుల పాటు జిల్లాలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి రాజ్‌భవ¯Œ కు వచ్చేశారు.
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న తమిళిసై ఆ రాష్ట్రంలోనూ అలాంటి అనుభవమే ఎదురైంది. అయితే అక్కడ అధికార పక్షం కాకుండా.. విపక్షం ఆమె ఆహ్వానాన్ని తిరస్కరించింది. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది మాదిరిగానే పుదుచ్చేరిలోనూ తమిళ సంవత్సరాది ‘చిత్తిరూ నిలవు’ పండగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై పుదుచ్చేరిలో విందు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రంగస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే గవర్నర్ విందుకు ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు గైర్హాజరయ్యాయి. ఇన్‌చార్జి లెప్టినెంట్ గవర్నర్‌గా రాజ్యాంగబద్ధమైన హోదాలో వున్న తమిళిసై తన పరిధి దాటి వ్యవహరిస్తూ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ఈ విందును బహిష్కరించాయి. తాజాగా ఈ నేపథ్యంలోనే తమిళిసై ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. రెండు రాష్ట్రాల్లో తనకు ఎదురవుతున్న పరాభవాలను మళ్లీ కేంద్రం దృష్టికి తీసుకెళ్తారా?.. లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.