Homeజాతీయ వార్తలుGovernor Tamilisai- KCR: గవర్నర్‌ ను నెత్తిన పెట్టుకున్న కేసీఆర్‌.. ఈ కొత్త రాజకీయం వెనుక...

Governor Tamilisai- KCR: గవర్నర్‌ ను నెత్తిన పెట్టుకున్న కేసీఆర్‌.. ఈ కొత్త రాజకీయం వెనుక మతలబేంటి?

Governor Tamilisai- KCR: తెలంగాణ ప్రజలు ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న దృశ్యం ఆవిష్కృతమైంది. దాదాపు మూడేళ్లుగా ఉప్పు, నిప్పులా ఉన్న గవర్నర్, సీఎం ఒకే వేదికపై కలుసుకున్నారు. కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందుకు తెలంగాణ నూతన సెక్రటేరియేట్‌ వేదికైంది.

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నూతనంగా నిర్మించిన ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ముందుగా సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌.. తర్వాత వచ్చిన గవర్నర్‌కు స్వాగతం పలికారు. ఆమెతో కలిసి సీఎం కేసీఆర్‌ నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చర్చి, మసీదులను కూడా ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తర్వాత గవర్నర్‌ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.

తొలిసారి కొత్త సచివాలయానికి..
కొత్త సచివాలయం నిర్మించిన తర్వాత ఆ ప్రాంగణంలోకి గవర్నర్‌ రావడం ఇదే తొలిసారి. సచివాలయ ప్రారంభానికి కూడా గవర్నర్‌ను పిలవని కేసీఆర్‌.. దాని ఆవరణలో నిర్మించిన మందిరం, మసీదు, చర్చి ప్రారంభించడానికి ఆహ్వానించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరోవైపు మంత్రులు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా గవర్నర్‌తో దూరంగా ఉన్నారు. కానీ సచివాలయానికి వచ్చిన గవర్నర్‌కు పోటీపడి స్వాగతం పలికారు.

‘పట్నం’ ప్రమాణ స్వీకారం కోసం..
ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిని కేసీఆర్‌ తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఈమేరకు రాజ్‌భవన్‌లో గురువారం ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాజ్‌ భవన్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్, గవర్నర్‌తో 20 నిమిషాలపాటు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగానే సచివాలయంలో ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవాలకు ఆహ్వానించారు. దీంతో గవర్నర్‌ హాజరయ్యారు.

ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ..
పట్నం మహేందర్‌రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం సందర్భంగా సీఎం కేసీఆర్‌కు, గవర్నర్‌కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్టు తెలిసింది. ‘కొత్త సచివాలయం అద్భుతంగా ఉన్నది. ఈ మధ్య కొత్త సచివాలయం ముందు నుంచి వెళ్తున్నప్పుడు చూశాను. బాగుంది’ అని గవర్నర్‌ అనగా, ‘హైదరాబాద్‌ గంగాజమునా తెహజీబ్‌కు ప్రతీకగా సచివాలయ ప్రాంగణంలో ఆలయం, మసీదు, చర్చి నిర్మించాం. శుక్రవారం పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 12 గంటలకు నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమానికి రావాలని సీఎం ఆహ్వానించారు. తప్పకుండా వస్తానని గవర్నర్‌ చెప్పారు. చెప్పినట్లుగానే కార్యక్రమానికి హాజరయ్యారు గవర్నర్‌.

రాజకీయం కోసమేనా..
మూడేళ్లుగా రాజ్‌భవన్‌కు దూరంగా ఉన్న కేసీఆర్‌.. తాజాగా గవర్నర్‌ను ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. యాదాద్రి ఆలయ పునఃప్రారంభానికి, కొత్త సచివాలయ ప్రారంభానికి, అంబేద్కర్‌ విగ్రహావిష్కరణకు, అమరవీరుల స్థూపం ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను ఆహ్వానించలేదు. కానీ, ఆలయం, ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవానికి పిలవడం రాజకీయాల కోసమేనా అన్న చర్చ జరుగుతోంది. ఎన్నికల వేళ అధికారాలన్నీ గవర్నర్‌ చేతిలోకి వెళ్తాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయినప్పటి నుంచి సీఎం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మారిపోతారు. ఈ సమయంలో అధికారాలన్నీ గవర్నర్‌ చూసుకుంటారు. దీంతో ఇప్పడు గవర్నర్‌తో విభేదాలు సరికాదని భావించిన కేసీఆర్‌ అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version