Governor Tamilisai- Teenmar Mallanna: బీఆర్‌ఎస్ కార్యక్తపై దాడి కేసులో క్యూన్యూస్ యజమాని తీన్మార్ మల్లన్న అలియస్ చింతపండు నవీన్‌కుమార్‌ను హైదరాబాద్ పోలీసులు నాటకీయంగా అరెస్ట్ చేశారు. ఎవరు అదుపులోకి తీసుకున్నారో తెలియకుండా మఫ్టీలో వచ్చిన పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని వెళ్లారు. అరెస్ట్ చేసినట్లు చెప్పకుండా పోలీస్ స్టేషన్లు తిప్పారు. 24 గంటల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. భర్తకు ఏమైందో తెలియన తీన్మార్ మల్లన్న భార్య మమత ఆందోళన చెందారు. చంటి బిడ్డలను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. చివరకు న్యాయం చేయాలని రాజ్‌భవన్ గడప తొక్కారు. స్పందించిన గవర్నర్ మమత వద్ద ఉన్న పిల్లలను చూసి చలించిపోయారు. పాపకు ఉన్న అనారోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాపను ఒడిలో కూర్చోపెట్టుకుని లాలించారు.. ‘పాపకు ఏమైందమ్మా అంటూ బిడ్డను దగ్గరకు తీసుకున్నారు’ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎలాంటి ట్రీట్ మెంట్ జరుగుతుందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు గవర్నర్ తమిళిసై.
గవర్నర్‌కు ఫిర్యాదు..
తీన్మార్ మల్లన్నను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆయన భార్య మమత రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ మల్లన్న లేకుండా బిడ్డ ఉండలేదని.. నాన్న నాన్న అంటూ రోజూ కలవరిస్తుందని.. బిడ్డను చూడకుండా మల్లన్న కూడా ఉండలేడంటూ గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకెళ్లారు. పాప పరిస్థితి చూసి కూడా పోలీసులు కనికరించలేదంటూ వివరించారు. పాపను చాలాసేపు తన ఒడిలోనే కూర్చోపెట్టుకుని ఆడించిన గవర్నర్ తమిళిసై.. డాక్టర్‌గా కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. గవర్నర్ తమిళిసై ఒడిలో.. తీన్మార్ మల్లన్న బిడ్డ అంటూ సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ముందు నుంచీ అనారోగ్యమే..
తీన్మార్ మల్లన్న కూతురు మొదటి నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో మల్లన్న పాపను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. 2021లోనూ తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేయడంతో అతని కూతురు అప్పుడు కూడా తండ్రిపై బెంగ పెట్టుకుంది. తీవ్ర అనారోగ్యానికి గురై.. ఐసీయూలో చికిత్స పొందింది. తాజాగా మల్లన్న అరెస్టు తర్వాత…ఆ చిన్నారి బాగా బెంగ పెట్టుకుంది. తన తండ్రి లేకపోవడంతో అన్నం తినడం మానేసింది.
మొత్తంగా మల్లన్న భార్యకు గవర్నర్ ధైర్యం చెప్పారు. అయితే తక్షణం ఊరటనిచ్చే చర్యలు తీసుకోలేకపోయినా.. మల్లన్న బిడ్డను గవర్నర్ లాలించడం, ఆ ఫొటోలు నెట్టింట్లోల వైరల్ కావడం ఆసక్తిగా మారింది.