https://oktelugu.com/

TSPSC : రేవంత్ రెడ్డి కోరుకున్నదే జరిగింది..

దీంతో విద్యా ఉద్యోగాల విషయంలో పట్టుదలగా ఉన్న సీఎం రేవంత్ కు ఇప్పుడు నూతన చైర్మన్, సభ్యుల నియామకానికి మార్గం సుగమమైంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 10, 2024 8:57 pm
    Follow us on

    TSPSC :  తెలంగాణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి కోరుకున్నదే జరిగింది.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డితోపాటు సభ్యుల రాజీనామాను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బుధవారం ఆమోదించారు. దీంతో విద్యా ఉద్యోగాల విషయంలో పట్టుదలగా ఉన్న సీఎం రేవంత్ కు ఇప్పుడు నూతన చైర్మన్, సభ్యుల నియామకానికి మార్గం సుగమమైంది.

    నెల క్రితం రాజీనామా..
    టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బి.జనార్ధన్‌రెడ్డి, ఐదుగురు సభ్యులు గత డిసెంబర్‌లో తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే రాజీనామాల ఆమోదం విషయంలో గవర్నర్‌ ఆచితూచి అడుగులు వేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాజీనామాలు ఆమోదించాలని గవర్నర్‌కు లేఖ రాశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యులు లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోందని లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో మంగళవారం ప్రభుత్వం కూడా గవర్నర్‌కు లేఖ రాసింది. రాజీనామాల ఆమోదం విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించింది. ఈ క్రమంలో గవర్నర్‌ రాజీనామాలకు ఆమోదం తెలిపారు.

    దిగజారిన కమిషన్‌ ప్రతిష్ట..
    ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకానికి టీఎస్‌పీఎస్సీ జాతీయ స్థాయిలో ఘనత సాధించింది. పలు రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా నిలిచింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్‌లోనే పరీక్షల నిర్వహణ, పారదర్శకంగా ఫలితాల 6పకటన, తదితర ప్రక్రియలకు సరికొత్త సాంకేతిక విధానంతో పూర్తిచేçస్తూ ఆదర్శంగా నిలిచింది. 2021, మే 21న టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా జనార్దన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే నూతన జోనల్‌ విధానం అమలులోకి వచ్చింది. దీంతో ఉద్యోగ ప్రకటనలు జారీలో జాప్యం జరిగింది. 2023 ఏప్రిల్‌ నుంచి ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. 503 ఉద్యోగాలతో గ్రూప్‌–1 నియామకాలకు టీఎస్‌పీఎస్పీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. తర్వాత వరుసగా 30 వేల ఉద్యోగాల భరీతకి కూడా నోటిఫికేషన్లు రిలీజ్‌ చేసింది.

    ఇంటి దొంగలతోనే..
    పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి పూనుకోవడంతో టీఎస్‌పీఎస్సీలోనే దొంగలు తయారయ్యారు. గ్రూప్‌–1తోపాటు పలు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు బయటకు రిలీజ్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా టీఎస్‌పీఎస్పీ ప్రతిష్ట దిగజారింది. పోలీసు కేసులు నమోదు కావడం, ఉద్యోగులు జైలుకు వెళ్లడం, అప్పటికే నిర్వహించిన పరీక్షలన్నీ రద్దు చేయడం తదితర చర్యలు కమిషన్‌ను అప్రతిష్టపాలు చేశాయి. ఈ నేపథ్యంలో విపక్షాలతోపాటు, నిరుద్యోగులు కమిషన్‌ చైర్మన్‌తోపాటు సభ్యులను మార్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. కానీ, గత ప్రభుత్వం ఉలుకు పలుకులేకుండా వ్యవహరించింది. తర్వాత పరిస్థితులు సద్దుమణిగాయి. దీంతో పరీక్షలు మళ్లీ నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్పీ తేదీలను ప్రకటించింది. దీంతో నిరుద్యోగులు మళ్లీ చదువుపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. మంత్రిగా ఉన్న కేటీఆర్‌ కూడా చివరకు టీఎస్‌పీఎస్పీ ప్రక్షాళన హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సభ్యులు కూడా ఆయన బాటలోనే నడిచారు. తాజాగా వారి రాజీనామాలను గవర్నర్‌ ఆమోదించారు.