ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారనే కారణంతో ముగ్గురు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏపీ ఆర్థిక శాఖలో పని చేస్తున్న ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీ ఆర్థిక శాఖ వ్యవహారాలపైన మీడియాలో వస్తున్న కథనాలపై విజిలెన్స్ దృష్టి సారించింది. ముగ్గురు అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేసింది.
ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్న నాగులపాటి వెంకటేశ్వర్లు, సెక్షన్ ఆపీసర్లుగా పనిచేస్తున్న డి.శ్రీనుబాబు, కసిరెడ్డి వరప్రసాద్ లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వ్యవహారాలను ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారనే విజిలెన్స్ నివేదిక వెల్లడించింది. ఈ ఫైలింగ్ ద్వారా నడుస్తున్న వ్యవహారాలను కావాలనే లీక్ చేశారనే నిర్ధారించారు.
ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అధికారుల అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లకూడదని సూచించింది. ఏపీ ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంపై పత్రికల్లో విభిన్నంగా కథనాలు వస్తున్నాయి. దీనిపై పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ పలు విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వం నిర్వహణకు భారీ ఎత్తున అప్పులు చేస్తోంది. దీనిపై విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ప్రభుత్వానికి పలు రకాల హెచ్చరికలు సైతం వస్తున్నాయి. అయినా లెక్క చేయడం లేదు. ప్రభుత్వంలో కీలకమైన సమాచారాన్ని ముగ్గురు అధికారులు లీక్ చేశారనే అభియోగం నమోదైంది. విజిలెన్స్ విచారణ తరువాత ఆ ముగ్గురు అధికారులపై చర్యలు ఉంటాయని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ఉత్తర్వులు జారీచేశారు.