తక్షణమే ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ స్టాఫ్ కూడా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. కార్యాలయాలకు వచ్చేముందు స్టేటస్ గమనించుకోవాలని కోరింది.
యాప్‌లో సేఫ్, లేదా లో రిస్క్ అని వస్తేనే కార్యాలయానికి బయలుదేరాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. యాప్ స్టేటస్ కనుక మోడరేట్ లేదా హై రిస్క్ అని చూపిస్తే కార్యాలయాలకు రావొద్దని తెలిపింది. మోడరేట్ లేదా హై రిస్క్ స్టేటస్ వచ్చిన వారంతా 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉండాలని కేంద్రం సూచించింది.
స్టేటస్‌లో మళ్లీ సేఫ్ లేదా లో రిస్క్ వచ్చేవరకూ కార్యాలయాలకు రావొద్దని తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా ఆరోగ్యసేతు యాప్ తప్పకుండా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. అంతేకాదు మొబైల్ డాటా ఎప్పుడూ ఆన్‌లో ఉంచుకోవాలని సూచించింది.
కేంద్రం ఇటీవల విడుదల చేసిన కరోనా ట్రాకింగ్ యాప్ ఆరోగ్య సేతును ఇప్పటికే కోట్లాది మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రజలతో అనుసంధానం కావడంతో పాటు కరోనా సోకిన వ్యక్తులను ట్రాక్ చేసి అప్రమత్తమయ్యేలా కేంద్రం దీన్ని రూపొందించింది. ఐవోఎస్‌తో పాటు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో కూడా ఆరోగ్య సేతు పనిచేస్తుంది.
బ్లూటూత్ ఆధారంగా పనిచేసే ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హెల్ప్‌లైన్ నంబర్లతో పాటు ఆరోగ్య శాఖ పెట్టే పోస్టులు, ఇతర వివరాలు, వైద్య సలహాలు అందుబాటులో ఉంటాయి. కరోనా సోకిన వ్యక్తికి దగ్గరగా వెళ్తే వెంటనే ఈ యాప్ అప్రమత్తం చేసి హెచ్చరిస్తుంది.
అయితే తాజాగా నమోదైన పాజిటివ్ కేసులను మాత్రమే ఇది పసిగడుతుందని చెబుతున్నారు. అత్యంత సులభంగా వినియోగించేందుకు వీలుగా 11 భాషల్లో దీన్ని రూపొందించారు.